నంగునూరు, నవంబర్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని.. ప్రభుత్వ తీరుతో పత్తి, వడ్లు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని సిద్దన్నపేటలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం, రైస్‌మిల్లులు అలాట్మెంట్ ఆలస్యం చేయడం, డబ్బులు ఆలస్యంగా ఇవ్వడం కారణంగా సగానికి సగం ధాన్యం రైతులు దళారులకు అమ్మి నష్టపోయారన్నారు. క్వింటాలుకు రూ.2300 మద్దతు ధర ఉంటే.. రైతులు రూ.1900 కే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు.
రూ.500 బోనస్ బోగస్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వానకాలం రైతుబంధు వేయలేదని.. కేసీఆర్ హయాంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందించారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వడ్లు కొనుగోలు చేయకపోతే అధికారులను ఎవరినీ అడగట్లేదని, కానీ.. మద్యం అమ్మకాలు చేయకపోతే ఎక్సైజ్ సూపరింటెండెంట్, సీఐలను ట్రాన్స్ఫర్ చేశాడన్నారు. తెలంగాణను రేవంత్‌రెడ్డి తాగుబోతులను చేయాలనుకుంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కానీ.. ప్రజలకు మద్యం తాగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడని విమర్శించారు.
యాసంగికి ముందే రైతులకు రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకముందు సిద్దిపేట జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఇక్కడ రైతులు పంటలు పండించే వారని.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు సిద్దిపేట జిల్లాలో రూ.5 లక్షలకు ఎకరం ధర ఉంటుండే.. భూములకు విలువ లేకుండే అని.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక ఎకరం భూమి రూ.50 లక్షలకు విలువ పెరిగిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక భూముల విలువ తగ్గి, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వడ్ల కొనుగోలు చేసి, రైతులకు మద్దతు ధర చెల్లించాలని హరీశ్‌రావు కోరారు.
నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం పలు కుటుంబాలను పరామర్శించారు. మగ్ధూంపూర్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పాకాల కనకయ్య, రాములు ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబాలను హరీశ్‌రావు పరామర్శించారు. అంక్షాపూర్కు చెందిన జర్నలిస్ట్ నరోత్తమ్‌రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు. నంగునూరు మండల కేంద్రంలో పురోహితుడు సాయినాథ్‌శర్మ నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని, మండల పరిధిలోని సిద్దన్నపేటలో ఏఈఓ శిరీష తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు.
నారాయణరావుపేట, నవంబర్ 14: జకాపూర్కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కొంపెల్లి సాగర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వారి కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే తిరిగి రాని లోకానికి వెళ్లిన సాగర్ మృతి ఎంతో కలిచి వేసిందన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, ఆదుకుంటానని భరోసానిచ్చారు. చింతమడక మాజీ ఎంపీటీసీ దేవేందర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు