బెజ్జంకి, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని, అసంపూర్తి రోడ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బేగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం బేగంపేట నుంచి బెజ్జంకి వరకు ర్యాలీ నిర్వహించి, బెజ్జంకిలో ఫ్లకార్డులతో అర్ధనగ్న ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని కోహెడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ప్రజా సమస్యలు పట్టించుకోని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే రాజీనామ చేయాలని, పోలీస్ జులూం నశించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. అరెస్ట్‌లు చేస్తే బయపడే పరిస్థితి లేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పత్తి, వరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో బీఆర్ఎస్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్‌గుప్తా, రాజయ్య, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామలింగారెడ్డి, మల్లేశం, రాజు, శ్రీనివాస్, మోహన్, సత్యనారాయణరెడ్డి, రాజిరెడ్డి, దేవయ్య, శేఖర్‌బాబు, నరేశ్, రవి, రమేశ్, మల్లేశం, సుదర్శన్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలోని రోడ్లను వెంటనే బాగుచేయించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదన్నారు. ప్రజల పక్షాన రోడ్ల బాగు చేయాలని బీఆర్ఎస్ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం సరికాదన్నారు. అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో బేగంపేట వరకు డబుల్ రోడ్డుగా మార్చి పనులు చేట్టామని, చిన్నకోడూర్ మండలం చౌడారం నుంచి పెరుకబండ వరకు తారు రోడ్డు నిర్మాణానికి కల్వర్టులు పూర్తి కాగా, మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఎన్నికల కోడ్‌తో పని ఆగిపోయిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలో రాగానే ఎమ్మెల్యే కవ్వంపల్లి బెజ్జంకి మండలంతో పాటు నియోజక వర్గంలో అసంపూర్తి రోడ్లు, మరమ్మతులకు మంజూరైన నిధులు రద్దు చేశాడని, తిరిగి ఏ ఒక్క రోడ్డుకు రూపాయి నిధులు తేలేదని రసమయి విమర్శించారు. రోడ్లు దెబ్బతిని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుపోవడానికి లారీలు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు గ్రామాల్లోకి రాని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులు చేయించకుంటే ఎమ్మెల్యేను ప్రజలు తిరగనివ్వరని రసమయి బాలకిషన్ హెచ్చరించారు.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
బెజ్జంకి మండలంలోని ప్రధానంగా గుంతలుపడిన రోడ్ల రెన్యువల్, పోతారం ఎక్స్ రోడ్డు నుంచి బెజ్జంకి, బెజ్జంకి నుంచి బేగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు కాగా, పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోడ్‌తో అప్పట్లో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బెజ్జంకి మండలంలోని మొత్తం రోడ్ల రెన్యువల్ నిధులు రద్దు చేసింది. బెజ్జంకి, బేగంపేట వరకు డబుల్ రోడ్డు, గుగ్గిళ్ల బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు, బెజ్జంకి నుంచి పోతారం ఎక్స్ రోడ్డు రూ.1.20 కోట్లు, చీలాపూర్ ఎక్స్‌రోడ్డు, చీలాపూర్, గుండారం రూ.1 కోటి, బెజ్జంకి, గుండారం, కిష్టాపూర్ రూ.1.20 కోట్లు, బెజ్జంకి, కల్లెపల్లి, వయా రేపాక రూ.1.20 , వీరాపూర్ నుండి లక్ష్మీపూర్ రూ. 1.20 కోట్లు, దేవక్కపల్లి స్టేజీ నుంచి వరికోలు బ్రిడ్జి వరకు రూ.50 లక్షలు, గాగిల్లాపూర్ స్టేజీ నుండి రాంచంద్రాపూర్ బ్రిడ్జి వరకు రూ.50 , రేగుపల్లి స్టేజీ నుండి పాఠశాల వరకు రూ50. లక్షలు, దాచారం వీరాపూర్, గునుకులకోండాపూర్ వరకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.