చేర్యాల, మే 13: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బాలికల పాఠశాల, పెద్దమ్మగడ్డ పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ నెలకొంది. చేర్యాల ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు బాహాబాహీకి దిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పట్టణంలోని బాలికల పాఠశాల పోలింగ్ కేంద్రంలో కొందరు అధికార పార్టీ నాయకులు లోపలికెళ్లి ప్రచారం చేస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లి నిబంధనల మేరకు ప్రచారం చేయాలని సూచించారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పల్లాతో పంచాయతీ చేయాలనే తలంపుతో అక్కడకు చేరుకుని బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే స్థాయికి చేరుకోవడంతో పలువురు జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఘర్షణ తగ్గుముఖం పట్టలేదు. అధికార కాంగ్రెస్ నాయకులు అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గోబ్యాక్ అనే నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు మాజీఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్రం వద్ద ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్ఐ దామోదర్ పోలీస్ సిబ్బందితో తరలివచ్చి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించినప్పటికీ నాయకులు ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, నియోజవకర్గ ఎమ్మెల్యే హోదాలో కేంద్రానికి వస్తే కొందరు నాయకులు తాగి వచ్చి ఘర్షణ దిగి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిని మొదటగా ఇక్కడ నుంచి పంపించాలని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ నాయకులు చేస్తు న్న నినాదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసులు వారిని కట్టడి చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. తమ వద్ద ఓటర్లు ఉన్నారని, వారి వద్ద క్వార్టర్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సుమారు గంటపాటు జరిగిన వాగ్వాదం, తోపులాటను సద్దుమణిగించేందుకు సీఐ శ్రీను కృషి చేయడంతో ఇరువర్గాలు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందుకు చేర్యాల పట్టణంలోని పెద్దమ్మగడ్డ పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ జనగామ ఇన్చార్జి ప్రతాప్‌రెడ్డి, ఆయన కుమారుడు రాకేశ్రెడ్డిలతో కలిసి గుంపుగా వెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చేర్యాల పట్టణంలోని జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ నాయకులు కుర్చీలు వేసుకుని ప్రచారం చేస్తుండడంతో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత అందె బీరన్న అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.