మెదక్, జనవరి 12 (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ : సింగూరు జలాలు వ్యవసాయ రంగానికి విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ ఉద్యమమిస్తుందని, ప్రభుత్వం సింగూరు జలాలు ఘనపూర్ ప్రాజెక్టుకు వదలాకుండా కుట్ర చేస్తున్నదని ఆపార్టీ నేతలు ఆరోపించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగూరు జలాలు ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహాధర్నా చేసి జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈమహాధర్నాకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఘనపూర్ ప్రాజెక్టుకు సింగూరు నీటిని విడుదల చేశారన్నారు. సింగూరు నీటిని పూర్తిగా వ్యవసాయరంగానికి వాడుకునేలా మాజీ సీఎం కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేశారు. ఘనపూర్ ప్రాజెక్టుకు ఉన్న కుడి, ఎడమ కాల్వ ద్వారా 21వేల ఎకరాలకు సాగునీరు అందించారన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడారు . 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడం లేదని కేవలం 12 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. మెదక్ జిల్లాలో ఉన్న ఘనపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, రైతులు ప్రభుత్వానికి బుద్ధిచెప్పడం ఖాయమన్నారు.

మెదక్ ప్రాంతంలో ఉన్న రాయిన్‌పల్లి ప్రాజెక్టు, జనకంపల్లి మత్తడి మరమ్మతులు చేయకపోవడంతో వరద నీరు వృథాగా పోతుందన్నారు. భారీ వర్షాల వల్ల రాయిన్‌పల్లి ప్రాజెక్టుకు గండిపడినా ప్రభుత్వం మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. దీంతో 12 వందల ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. ఆయకట్ట రైతులు పంటలు సాగు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.సింగూరు నీటిని విడుదల చేయకపోతే క్రాప్‌హాలిడే ప్రకటించి రైతులకు ఎకరానికి రూ. 25వేల నష్టపరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోవడం లేదని ఆరోపించారు . వాగు నుంచి ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. యాసంగిలో రైతులకు సాగునీరు అందక వ్యవసాయ భూములు బీడుగా మారే ప్రమాదం ఉందని, రాయిన్‌పల్లి ప్రాజెక్టు ఆయకట్ట రైతులకు ప్రభుత్వం పంటనష్టపరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. తిమ్మనగర్ రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు .రైతుల సమస్యల పరిష్కారం కోసం పోస్టుకార్డు ఉద్యమం చేస్తామని ప్రకటించారు. ప్రతి రైతు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డు రాయాలని కోరారు.
మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మమాధర్నా సక్సెస్ అయ్యింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ధర్నాకు వచ్చి కాంగ్రెస్ చేసిన మోసాల పై ప్రసంగించారు.
రైతు ధర్నాలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ మాజీ మున్సిపాల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు సోములు, శివంపేట మాజీ ఎంపీపీ హరికృష్ణ్ణ, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, జగన్, వెంకట్‌రెడ్డి, రామాగౌడ్, లక్ష్మణ్, అంజగౌడ్, ఉదయ్, విష్ణువర్ధన్‌రెడ్డి, సాంబశివరావు, జుబేర్, శ్రీనాథ్, లింగారెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించిన అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు గేట్ వద్ద ధర్నా చేశారు. దీంతో పోలీసులు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వగా అరగంట తర్వాత అనుమతి ఇచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు.

ఘనపూర్ ప్రాజెక్టుకు సింగూరు నీళ్లు విడుదల చేసే వరకూ ఉద్యమం చేస్తాం. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల పేరుతో ప్రభుత్వం వ్యవసాయరంగానికి నీటిని విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ సింగూరు నీటిని హైదరాబాద్ ప్రజల అవసరాలకే కాకుండా మెదక్ రైతుల అవసరాల కోసం విడుదల చేశారు. యాసంగిలో ఘనపూర్ ప్రాజెక్టుకు సింగూరు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైంది. సింగూరు నీళ్లు ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయకుంటే క్రాప్‌హాలిడే ప్రకటించి రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలి. రెండేండ్ల క్రితమే మరమ్మతులు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండేవికావు.
-పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు
బీఆర్ఎస్ హయాంలో ఏరోజు కూడా రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నా చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ సింగూరు జలాలు మెదక్ జిల్లా రైతులకే కేటాయించారు. వ్యవసాయరంగానికి సాగునీరు అందించాలని ఉత్తర్వులు ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదు. యాసంగి పంటల కోసం రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు బోరుబావుల కింద నాట్లు వేసుకున్నారు. నాట్లు వేసిన తర్వాత నీళ్లు ఇవ్వమని అధికారులు చెప్పడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.పాలకులు రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రైతుల విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలిసినా పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసేలా పోస్టు కార్డు ఉద్యమం చేస్తాం. పంటలు సాగుచేసిన రైతులకే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించడం దారుణం. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వలేదు. కర్షకులకు 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జిల్లా అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదు.
-సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే