Zaheerabad | జహీరాబాద్ , మార్చి 12 : గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జహీరాబాద్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ డిమాండ్ చేశారు
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి వెళుతున్న మాజీ సర్పంచులను జహీరాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు గ్రామాలలో ప్రభుత్వ ఆదేశానుసారం అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలుగా గ్రామాలను తీర్చి దిద్దడంలో తమ వంతు కృషి చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీలలో ప్రజల సౌకర్యార్థం వీధిలైట్ల నిర్వహణ, అంతర్గత మురుగు కాల్వల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రగతి, తాగునీటి పథకాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు పనులకు సంబంధించి మాజీ సర్పంచ్లకు లక్షల రూపాయాలు రావాల్సి ఉందన్నారు. ఏడాది కాలంగా గత, ప్రస్తుత ప్రభుత్వాలపై పెండింగ్ బిల్లుల చెల్లింపు గూర్చి ఒత్తిడి తేవడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13నెలలైనా పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడం వల్ల తాజా మాజీ సర్పంచ్లు మనోవేదనకు లోనవుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా పనులకు చేసిన అప్పుల భారంతో అనేక మంది తాజా మాజీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని లక్ష్మీనర్సింహారెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్ బిల్లుల చెల్లింపు గూర్చి అనేకమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. బిల్లులు అడుగుతే పోలీసులు చేత అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం సొంత పూజి కత్తుపై మాజీ సర్పంచ్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చిన్నారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.