కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 25: నిర్ధేశించిన సమయం మించి అర్ధరాత్రి వరకు హోటల్ నిర్వహిస్తూ నిబంధనలను బేఖాతరు చేస్తున్న కొంపల్లిలోని లక్కీ రెస్టారెంట్ యజమానికి మేడ్చల్ కోర్టు ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమాన విధించిన్నట్లు పేట్ బషీరాబాద్ సీఐ విజయ్‌వర్ధన్ తెలిపారు. కొంపల్లిలో మొహమ్మద్ అబ్ధుల్ రషీద్ అదే ప్రాంతంలో లక్కీ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి హోటల్‌ను మూసివేయాలని పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి వరకు హోటల్‌ను నడుపుతున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మేడ్చల్‌లోని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా శిక్ష విధించారు. వ్యాపార సంస్థల యమాజనులు ఎవరైనా పోలీసుల నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మియాపూర్, ఫిబ్రవరి 25 : ఆల్విన్ కాలనీ సర్కిల్ హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట కూడలిలో ఉన్న మెహెఫిల్ రెస్టారెంట్‌కు జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు బుధవారం నోటిసులు జారీ చేశారు. రెస్టారెంట్లో నిత్యం సుమారు వంద కిలోల వరకు వ్యర్థాలు పోగవుతుండగా, ఆవరణలోనే వేస్తుండటాన్ని అధికారులు తమ తనిఖీలో గుర్తించారు. వ్యర్థాల నిర్వహణలో రెస్టారెంట్ నిర్వాహకులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పాటించడం లేదన్న కారణంతో నోటీసును అందించారు.
ఈ సందర్భంగా ఉప కమిషనర్ చాముండేశ్వరి మాట్లాడుతూ వ్యాపార, వాణిజ్య సంస్థలు వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిందేనని, రోజువారీ 100 కిలోల మేర వ్యర్థాలు పోగయ్యే ప్రతి హోటళ్లు, రెస్టారెంట్లు స్వయంగా నిర్వహణను చేపట్టాలన్నారు. పెద్ద మొత్తంలో వ్యర్థాలు పోగవుతున్నా స్వంతంగా నిర్వహణ చేయనట్టుగా క్షేత్రస్థాయిలో గుర్తించామని అందుకే నోటీసులు జారీ చేశామన్నారు. పీఎన్ఆర్ ఎస్టేట్స్లోనూ ఇదే తరహాలో మరో రెండు హోటళ్లు స్వీయంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టడం లేనందున వారికి సైతం నిబంధనలను పాటించాలని నోటీసులు జారీ చేస్తున్నట్లు డీసీ తెలిపారు. అనంతరం కాలనీలో డోర్ టూ డోర్ వ్యర్థాల సేకరణను డీసీ తనిఖీ చేశారు. డీసీ వెంట ఎస్డబ్ల్యుఎం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.