సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 21 : విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆ దిశగా కృషిచేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఎంతగానో కృషి చేసింది.‘మనఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పాటు ఉపాధ్యాయుల కొరతతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 980 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇం దులో 640 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రా థమికోన్నత పాఠశాలలు, 227 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమా రు 80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 86 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సున్నా ఉండడం గమనా ర్హం. ప్రభుత్వ పాఠశాల్లలో సరైన సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేకపోవడంతో గతేడాది కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గింది. మరోవైపు సమయానికి పాఠశాల నిర్వహణ నిధులు రాక ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 4,092 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 2,157 మంది స్కూల్ అసిస్టెంట్లు, 1935 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో జిల్లాలో 1,036 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారందరినీ బదిలీ చేసినప్పటికీ ఇంకా 170 మంది ఉపాధ్యాయులు ఇంకా అదే పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు.
కొంత మంది ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ అధికారులు రిలీవ్ చేయకపోవడంతో బదిలీ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వీరందరినీ డీఎస్సీ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాతనే రిలీవ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 724 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉండగా.. డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాతనే కొత్త వారిని బదిలీ అయిన పాత స్థానంలోకి పంపి,పాత వారిని రిలీవ్ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.