ఇరుకు రోడ్లపైనే సంత… ఒకవైపు వాహనాల రాకపోకలు.. మరోవైపు ఇరుకుగా ఉన్న దారిపైనే కూరగాయల విక్రయాలు… దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు మార్కెట్ నిర్మించేందుకు నిధులు కేటాయించినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో దుమ్ము, ధూళిలోనే కూరగాయలు, మాంసపు విక్రయాలు రోడ్లపైనే నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
హుస్నాబాద్ టౌన్, జూన్ 16: పట్టణంలోని అక్కన్నపేట రోడ్ నుంచి రామవరం వెళ్లే రహదారులపై మార్కెట్ కొనసాగుతున్నది. మార్కెట్‌కు సొంత స్థలం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలిగిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం పాత తహసీల్ కార్యాలయంలో ఎకరా స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో కూరగాయలతో పాటు మాంసాహార విక్రయాలను వ్యాపారులు నిర్వహించుకునేందుకు భవన నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు. కానీ పనులు ఏండ్లకొలది జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హుస్నాబాద్ పట్టణంలోని దాదాపు 30వేల జనాభాకు సరిపడా కూరగాయలు, మాంసాహార మార్కెట్ లేకపోవడంతో శాశ్వత పరిష్కారం కోసం రామవరం రోడ్లో ఉన్న తహసీల్ కార్యాలయంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను రూ.2.75కోట్లతో నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనానికి 2022లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, అప్పటి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఇందులో కూరగాయలు, చికెన్, మటన్, చేపలను విక్రయించేందుకు 48 ప్లాట్ఫ్లాంలను నిర్మించే విధంగా డిజైన్ చేసి రూపొందించారు.
2022లో శంకుస్థాపన చేసిన కూరగాయలు, మాంసాహార మార్కెట్ పనులు నత్తనడక సాగుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మార్కెట్ కోసం స్థలం కేటాయించి నిధులు కేటాయించినప్పటికీ నిర్మాణ పనులు అసంపూర్తిగా మారడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెండర్ నిర్వహించి సదరు పనులను ఆర్ఎన్ కన్స్ట్రక్షన్కు అప్పగించారు. ఈ పనులను పొందిన సదరు సంస్థ వేగవంతంగా పనులు చేపట్టాల్సి ఉన్నా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నది. గతేడాదే పనులకు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయినప్పటికీ తిరిగి మరోమారు పనుల నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు కేవలం నాన్‌వెజ్‌కు సంబంధించిన పనులు మాత్రమే సాగుతుండంతో అసలు ఈ భవనం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పనులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లమీద అమ్ముకోవాలంటే మస్తు ఇబ్బందిగా ఉంది. కూసోరాదు.. అమ్ముకోరాదు. ఈడ మార్కెట్ సురువు సేసిండ్రు. కానీ పని సరిగా చేత్త లేరు. తొందర మార్కెట్ కడితే అందరికీ మంచిగ ఉంటది. సార్లు జెప్పన పనులు సెయిచ్చి బాధలు పోగొట్టాలే.
వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులు పూర్తిచేసే గడువు గతేడాది ముగిసింది. ఇప్పటివరకు వెజ్ మార్కెట్ పెట్టుకునేందుకు పనులు జరగలేదు. కేవలం నాన్‌వెజ్ పనులు మాత్రమే దగ్గరపడ్డాయి. మళ్లీ పనులు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. బిల్లులు రాలేదనే కారణంతో పనులు ఆలస్యంగా చేస్తున్నారు.