మెదక్, మార్చి 6(నమస్తే తెలంగాణ): ప్రతి గ్రామ పంచాయతీలో ఈ-పాలన అందుబాటులోకి తేవడం, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇంటర్నెట్ సేవలు గ్రామీణులకు అందించాలనే మంచి ఆలోచనతో అప్పటి ప్రభుత్వం దీనిని రూపొందించింది. ఈ సేవలు ప్రారంభానికి నోచుకోకుండానే మూలకు చేరాయి. గ్రామ పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సేవలు అందుబాటులోకి తెస్తే గ్రామీణ ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన బాధలు తప్పుతాయి.
ఇప్పుడు చిన్న చిన్న పనులకు మండల కేంద్రాలకు వెళ్తున్నారు. సేవలు పొందేందుకు ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీల్లో టీ-ఫైబర్ సేవలు అందించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి శాఖలో ఈ-ఆఫీస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. కలెక్టర్ దృష్టిసారించి జీపీల్లో సైతం టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో అవసరమైన టీ-ఫైబర్ కేబుల్, పరికరాలను బిగించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ పలకలు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ చేశారు. అన్నీ బాగానే ఉన్నా ఇప్పటి వరకు సేవలు ప్రారంభించకపోవడంతో గ్రామ పంచాయతీల్లో టీ-ఫైబర్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేక ఈ-పాలన మరుగు పడింది. దీంతో గ్రామాల్లోనే డిజిటల్ సేవలు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో సుమారు 74 మంది ఈ-పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధృవపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు రావాలన్నది ప్రధాన ఉద్దేశం.
గ్రామ పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు డిజిటల్ సేవలు అందించాలని గతంలో క్లస్టర్ల వారీగా ఈ-పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. వారికి కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ-పాలన జాడ లేకుండా పోయింది. చాలా మంది ఈ-పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్నా, వారికి పంచాయతీ కార్యదర్శులు పాత విధానంలోనే రసీదులు అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే గ్రామాల్లోనే ప్రజలకు డిజిటల్ సేవలు అందే అవకాశం ఉంటుంది.
మెదక్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో టీ-ఫైబర్‌కు సంబంధించిన పరికరాలు బిగించారు. కరెంటు కనెక్షన్ సైతం ఇచ్చారు. వాటి నుంచి మాత్రం గ్రామ పంచాయతీలకు ఎలాంటి సేవలు అందడం లేదు. టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు గ్రామీణులకు ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయి. గ్రామీణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం.
– యాదయ్య, డీపీవో మెదక్