గజ్వేల్, ఆగస్టు 1: ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను దిగ్విజయంగా అమలు చేసింది. ఈ పథకం ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్‌ను పక్కన పెట్టి పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేసీఆర్ కిట్లను సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూడడంలేదు. దీంతో నాడు ఎంతో ఆదరణ పొందిన పథకం.. నేడు అటకెక్కింది.
ప్రభుత్వ దవాఖానల్లో కిట్లను అందించకపోవడంతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన బాలింతలకు పంపిణీ చేయడంతో పాటు ఆడశిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12వేలను ఖాతాలో జమ చేసింది. వీటన్నింటికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్లు పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయిన మహిళలకు కిట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ కిట్ అమలు తర్వాత సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ఒకవైపు, మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూనే మరోపక్క కేసీఆర్ కిట్‌తో పాటు ప్రోత్సాహకంగా కేసీఆర్ ప్రభుత్వం డబ్బులు అందజేసింది. మహిళలు గర్భం దాల్చిన తరువాత గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గర్భిణుల వివరాలు సేకరించేవారు. అనంతరం వారి వివరాలను ఆన్లైన్ చేసి దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి డబ్బులు ఖాతాలో జమచేసేవా రు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయిన తర్వాత 102 వాహనంలో తల్లీబిడ్డను తీసుకెళ్లి ఇంటి వద్ద వదిలి పెట్టేవారు. నేడు కాంగ్రెస్ ప్రభు త్వం ఇవన్నీ అమలు కావడం లేదు.
గజ్వేల్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో(ఎంసీహెచ్) ప్రతిరోజు 15 నుంచి 20వరకు డెలివరీలు అవుతున్నాయి. అందులో సాధారణ ప్రసవాలకు ఎక్కువగా వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతినెలలో ఒక్క గజ్వేల్ దవాఖానలోనే 350 నుంచి 400వరకు డెలివరీలు అవుతున్నాయి. వీరంతా కిట్ అందుకోలేకపోతున్నారు. కేసీఆర్ కిట్‌కు వచ్చిన ఆదరణను చూసి ఈ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తే కేసీఆర్‌కే పేరు వస్త్తదనే భయంతో కిట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికిందనే ఆరోపణలు
ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ హయాంలో మిగిలిన కిట్లను స్టాక్‌లో ఉన్న వాటికి కేసీఆర్ ఫొటో ఉంటే దానిపై స్టిక్కర్ అతికించి కేసీఆర్ కిట్ పేరుకు బదులు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) పేరుగా మార్చి అందుబాటులో ఉన్న వాటిని అందించారు. పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త కిట్ల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పటికి గ్రామాల్లో గర్భిణుల నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు
ఆశ వర్కర్లు సేకరించి ఆన్లైన్ చేస్తున్నప్పటికీ కిట్లు, డబ్బులు అందడం లేదు. కిట్లు, డబ్బులు ఇవ్వకుండా వివరాలు సేకరించడంతో గర్భిణులు ఆశ కార్యకర్తలను తమ వివరాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.