దుబ్బాక టౌన్, అక్టోబర్ 12: బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది. విద్యార్థులకు సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నది. ‘మనఊరు-మనబడి’తో పాఠశాలల రూపురేఖలే మారుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టక ముందే సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సీఎం కేసీఆర్ చదివిన బడిని మోడల్ పాఠశాలగా నిర్మించారు. నాడు శిథిలావస్థలో ఉన్న బడిని సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేయించి శంకుస్థాపన చేశారు.
దేశంలో మోడల్ పాఠశాలగా నిర్మించారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, విశాలమైన గదులు, కాన్ఫరెన్స్ హాల్స్, ల్యాబ్లు నిర్మించారు. సుమారు రూ.10 కోట్లతో అత్యాధునిక పాఠశాల భవనం నిర్మించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ భవనంలో ఓ పక్క ఉన్నత పాఠశాల, మరోపక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగుతున్నది. విద్యార్థులు ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తున్నారు.