మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాధించి… స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలంపాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ముగింపు వేడులను మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడుస్తున్న నేపధ్యంలో దశాబ్ది ముగింపును తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. కార్యక్రమానికి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు. జూన్ 3న మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని, అనంతరం జిల్లాల్లోని పలు దవాఖానల్లో, అనాధ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు.