మెదక్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగే ఈ మహాధర్నాకు మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ధర్నా విజయవంతానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మహాధర్నాకు జిల్లా నుంచి రైతులు తరలిరానున్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని, పంట రుణమాఫీ సంపూర్ణంగా చేయాలనే డిమాండ్‌తో ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ శ్రేణులు
బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించే మెదక్ కలెక్టరేట్ వద్ద ఏర్పాట్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతితో పాటు బీఆర్ఎస్ నాయకులు మామిళ్ల ఆంజనేయు లు, మాజీ కౌన్సిలర్లు బుధవారం పరిశీలించారు.
కాంగ్రెస్ మెడలు వంచి బోనస్ ఇప్పిస్తాం
బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి
రైతులు పండించిన సన్నాలకు బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహిస్తామని, ఈ మహాధర్నాకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి హాజరుకానున్నారని ఆమె తెలిపారు. రైతుల నుంచి సన్న వడ్లను కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. రేవంత్ సర్కారు పంటరుణమాఫీ సంపూర్ణంగా చేయలేదన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొని రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలం
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న రైతులు స్వచ్ఛందంగా రైతు మహాధర్నాకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు గుర్రుగా ఉన్నారని, అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెబుతారన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి, తీరా గెలిచాక కేవలం సన్నాలకు బోనస్ ఇస్తామని కొర్రీలు పెట్టి అది కూడా ఇవ్వకుండా సర్కార్ రైతుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చితే, కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని తిరిగి కుదేలు చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.