సంగారెడ్డి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. బల్దియా ఫలితాలపై రాజకీయపార్టీలతో పాటు అన్నివర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్తో పాటు కాం గ్రెస్, బీజేపీ,ఎంఐఎం పార్టీలు ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ధీమాగా ఉన్నా యి. మున్సిపల్ వారీగా కౌన్సిలర్ స్థానాల గెలుపుపై అన్ని పార్టీలు లెక్కలు కడు తూ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి.
11 బల్దియాలు…
సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్-జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, కోహీర్ మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరిగింది. 256 వార్డులకు జరిగిన పోలింగ్లో మొత్తం 2,59,821 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 256 మున్సిపాలిటీల్లో మొత్తం 1045 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా శుక్రవారం జరిగే కౌంటింగ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 11 మున్సిపాలిటీల్లో 11 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్లను లెక్కించడానికి 11 కౌంటింగ్ కేంద్రాల్లో 350 టేబుల్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఫలితాలపై బీఆర్ఎస్ ధీమా
మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ ధీమాగా ఉంది. జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకత్వం చెబుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తున్నది. చైర్మన్ పదవులతోపాటు ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని ఆపార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓటమి భయం పట్టుకున్నది. అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తామని అధికార కాంగ్రెస్లో ఎన్నికలకు ముందు ధీమా ఉండేది. ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆశించిన ఫలితాలు రావని కాంగ్రెస్ అంచనాకు వచ్చింది. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్కు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఎంఐఎం, స్వంతంత్ర అభ్యర్థులను తమతో కలుపుకొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. మున్సిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన కౌన్సిలర్లను క్యాంపునకు తీసుకువెళ్లేందుకు పార్టీలు సిద్ధవుతున్నాయి.
