గజ్వేల్, డిసెంబర్ 3: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దత్తత గ్రామాలు సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎర్రవల్లి సర్పంచ్ ఆన్ రిజర్వుడ్ మహిళకు కేటాయించడంతో అక్కడ కవితరామ్మోహన్రెడ్డి, నర్సన్నపేటలో ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో గిల్క బాల్‌నర్సయ్యను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు గ్రామాలను కేసీఆర్ దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకున్నాయి.
రాష్ట్రంలోనే ఈ గ్రామాల్లో మొదట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడంతోనే మోడల్‌గా నిలిచాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎర్రవల్లి జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. అన్నింటికీ తమకు కేసీఆర్ ఉన్నడంటూ గ్రామస్తుల ఐక్య బలమే నేడు ఆ రెండు గ్రామాలను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు వేయించింది. ఎర్రవల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు నామినేషన్ వేసిన మాజీ సర్పంచ్ కమ్మరి భాగ్య బాల్‌రాజు గ్రామాభివృద్ధే లక్ష్యంగా తన నామినేషన్‌తో పాటు వార్డుల సభ్యులవి ఉపసంహరించుకున్నారు. రెండు గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచ్‌లను గ్రామస్తులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
మొదటి విడతలో సర్పంచ్ల ఏకగ్రీవం
మొదటి విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఏడు మండలాల్లో ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేశారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లతో పాటు వార్డుల సభ్యులను ఏకగ్రీవం చేయడంతో ఆ గ్రామాల్లో సంబురాలు జరుపుకొంటున్నారు. గజ్వేల్ మండలం రంగంపేటలో నరిగొప్పుల నాగరాజు, ములుగు మండలం జప్తి సింగాయిపల్లిలో బోమ్మగల్ల లక్ష్మి, మర్కూక్ మండలం ఎర్రవల్లిలో కవితరామ్మోహన్రెడ్డి, నర్సన్నపేటలో గిల్క బాల్‌నర్సయ్య, వర్గల్ మండలం గుంటిపల్లిలో బొమ్మ మహంకాళమ్మ, చాంద్ఖాన్మక్తలో సజనీత, జగదేవ్‌పూర్ మండలం పలుగుగడ్డలో నర్ర కనకయ్య, కొండాపూర్‌లో సొప్పరి పుష్ప, అనంతసాగర్‌లో క్యాసారం కనకయ్య, బీజీ వెంకటాపూర్‌లో చెక్కల పరమేశ్వర్, రాయపోల్ మండలం పెద్ద ఆరెపల్లిలో కర్రోళ్ల దివ్య, కొత్తపల్లిలో ఎక్కల శ్యామల, దౌల్తాబాద్ మండలం లింగాయపల్లి తండాలో గుగులోత్ లాఖ్యలు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.