గజ్వేల్, జూన్ 4: మెదక్ పార్లమెంట్ ఎన్నికలో భాగంగా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 22 రౌండ్లలో ఫలితాలు లెక్కించారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలో 44మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,25,607 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 85,432, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు 65,539, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 56,811, బీఎస్పీ అభ్యర్థి బి.ఈశ్వర్‌కు 1367 ఓట్లు రాగా నోటాకు 728 మంది ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 19,893 ఓట్ల ఆధిక్యత రావడంతో ఇక్కడ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో కాంగ్రెస్ నిలిచింది. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల వైపు ఓటర్లు మొగ్గు చూపించారు. అందులో గజ్వేల్ రూరల్, కొండపాక, కుకునూర్‌పల్లి, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాల్లో బీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్కు ఓట్లు తక్కువ పడగా కాంగ్రెస్‌కు రెట్టింపు ఓట్లు రావడంతో రెండో స్థానంలో నిలిచింది. గజ్వేల్‌లో బీఆర్ఎస్ తమపట్టును అలాగే నిలుపుకుంది.కార్యకర్తలు గ్రామాల్లో కష్టపడి పనిచేయడంతో మెజార్టీ వచ్చిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గజ్వేల్‌లో మొత్తంగా బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ అలాగే ఉంది. పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 19,893ఓట్ల మెజార్టీ రావడంలో పార్టీ శ్రేణులందరి కృషి ఉంది. మొత్తంగా గజ్వేల్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనలతో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరంతరం కష్టపడి పనిచేశారు.
దుబ్బాక,జూన్ 4: మెదక్ పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావుకు తన సొంతగడ్డ దుబ్బాకలో చేదు అనుభవం ఎదురైంది. మెదక్ పార్లమెంట్ ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు సొంత ప్రాంతమైన దుబ్బాక నియోజకవర్గంలో మెజార్టీ రాలేదు. గత దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రఘునందన్‌రావును దుబ్బాక ప్రజలు ఆదరించి, ఎమ్మెల్యేగా గెలిపించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో రఘునందన్‌రావు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని తెలుసుకున్న దుబ్బాక ప్రజలు అసెంబ్లీ ఎన్నికలో ఓడించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలో సైతం రఘునందన్‌కు దుబ్బాక ఓటర్లు అదే చేదు అనుభవాన్ని రుచి చూపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి ఆదరణ దక్కినప్పటికీ దుబ్బాకలో మాత్రం రఘునందన్‌కు మెజార్టీ రాకపోవడం గమనార్హం.
దుబ్బాక,జూన్ 4: మెదక్ పార్లమెంట్ ఎన్నికలో భాగంగా దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కే జై కొట్టారు. మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ .దుబ్బాక ఓటర్లు మాత్రం బీఆర్ఎస్కే మెజార్టీ అందించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్కు మెజార్టీ అందించి మరోసారి సత్తాచాటారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలతో పోల్చితే దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధికంగా బీఆర్ఎస్కు ఓట్లు రావడం విశేషం. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,64,952 ఓట్లు పోలవ్వగా..ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 66,714 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 50,873, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు 31,641, ఇతరులకు 15,724 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 15,841 ఓట్ల ఆధిక్యం సాధించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో దుబ్బాక నియోజకవర్గంలోనే బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ రావడం విశేషం.