పటాన్చెరు రూరల్, జూలై 27: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ బాధిత కుటుం బాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరు కానున్నారు. సిగాచి పరిశ్రమ పేలుడులో మృతిచెందిన కుటుంబాలకు న్యాయం చేసేందుకు జాప్యం ఎందుకవుతున్నదో ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ తీరు, అధికారుల కాలయాపన, పరిశ్రమ నిర్లక్ష్యంతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి హరీశ్‌రావును సంప్రదించారు.
న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పరిశ్రమ భద్రతా వైఫల్యంతో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు, జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించేందుకు హరీశ్‌రావు రాబోతున్నారు. మరోపక్క పరిశ్రమ యాజమాన్యం తీరు అనుమానాస్పదంగా ఉందని గుర్తించి న్యాయం చేయాలని బాధితులతో కలిసి హరీశ్‌రావు కలెక్టర్‌ను కలిసి కోరనున్నారు.
సిగాచి పరిశ్రమ పేలుడులో 46 మంది కార్మికులు, స్టాఫ్ మృతి చెందారు. జూన్ 30న జరిగిన పేలుడు తెలుగురాష్ర్టాల చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన. ఆరోజు డ్యూటీకి వెళ్లిన 8మంది కార్మికుల ఆనవాళ్లు ఇప్పటికీ లభ్యం కాలేదు. మిస్సైన వ్యక్తులకు నేటికీ డెత్ సర్టిఫికెట్ ఊసే లేదు. ప్రమాద తీవ్రతను క్షేత్రస్థాయిలో చూసిన సీఎం రేవంత్‌రెడ్డి మరణించిన ప్రతి కార్మికుడు, సిబ్బందికి ప్రభుత్వం తరపున రూ. లక్ష, కంపెనీతో రూ. కోటి నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీఇచ్చారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం మృతులకు రూ. 2లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 10లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 5లక్షలు పరిశ్రమ ఇచ్చేలా చూస్తామని సీఎం మీడియాకు తెలిపారు. ప్రమాదం జరిగి 28 రోజులవుతున్నది.
కాలం కరుగుతున్నకొద్ది అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చనిపోయిన కార్మికుల్లో 15మందికి రూ. 10లక్షల చొప్పున కార్మిక శాఖ రాష్ట్ర కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు చెక్కులు అందజేశారు. మరో పక్క గల్లంతైన 8 మంది కార్మికులు, స్టాఫ్ కుటుంబాలకు రూ. 15లక్షల చొప్పున కంపెనీ ప్రతినిధులు పరిహారం చెక్కులు అందజేశారు. ఆ తర్వాత గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున అందించారు. చనిపోయిన కుటుంబాలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ. లక్షల చొప్పున ఇచ్చింది. మిగిలిన ప్రతి కుటుంబానికి రూ. కోటి ఇవ్వాల్సి ఉంది. మిస్సైన వ్యక్తుల కుటుంబాలకు రూ. 85 లక్షలు చెల్లించాల్సి ఉంది. చనిపోయిన వారిలో మరో 31 కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి.
మరో 15 కుటుంబాలకు రూ. 90లక్షల చొప్పున ఇచ్చేది ఉంది. పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం, అధికారులు రూ. కోటి చెల్లించకుండా రూ. 10 లక్షలు, 15లక్షల చొప్పున కొందరికి ఇవ్వడంతో బాధిత కుటుంబాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవి కాకుండా బీమా కవరేజీలు, పీఎఫ్, ఇతర కంపెనీ బెనిఫిట్స్ రావాల్సి ఉంది. 28 రోజుల తర్వాత కూడా అయోమయ పరిస్థితి ఉండటంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మిస్సైన 8మంది బాధిత కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్స్ ఇంకా జారీ కాలేదు. మరణించిన 46మందిలో 38మంది డెత్ సర్టిఫికెట్లు పొందినట్టు సమాచారం. దవాఖానల్లో చికిత్స పొందినవారిని ఆదుకోవాల్సి ఉంది.
నేడు బాధితులతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్‌కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వెళ్తామని ఆ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఇస్నాపూర్ చౌరస్తాలో వారు మాట్లాడుతూ.. సిగాచి బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మృతి చెందినవారికి రూ. 10లక్షలు, గల్లంతైన వారికి రూ. 15లక్షలు పంపిణీ చేయడం అనుమానాలకు కారణం అని వారు పేర్కొన్నారు.
దవాఖానల్లో క్షతగాత్రులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. 15మందికి రూ. 10లక్షలు, మిస్సైన 8మంది కుటుంబాలకు రూ 15లక్షలు చెల్లించడం ఏ రకంగా సమంజసం అని ప్రశ్నించారు. సీఎం ప్రకటించిన రూ. కోటి చొప్పున పరిహారం ఒకేసారి ఎందుకివ్వరని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కలెక్టర్‌ను కలిసి త్వరగా రూ. కోటి చొప్పున అందరికీ పరిహారం చెల్లించాలని కోరుతామని తెలిపారు. బాధితులందరికీ న్యాయం చేసేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఆదర్శ్‌రెడ్డి అన్నారు.