మీరే నాబలం..బలగం.. ఎన్ని జన్మలెత్తినా మీరుణం తీర్చుకోలేనిదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జీవితాంతం మీకు సేవ చేస్తానన్నారు. రాఘవాపూర్ గులాబీ అడ్డా అని, సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారన్నారు. రాదనుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించి చూపించారన్నారు. కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, మండుటెండల్లో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయని, ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఘనతేనన్నారు. కాలంతో పనిలేకుండానే కాళేశ్వరం నీళ్లు కండ్లముందు కనిపిస్తున్నాయని తెలిపారు. గతంలో వానల కోసం ఆలయాల్లో జలాభిషేకాలు చేశారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు మహిళలు ఇబ్బందులు పడకుండా ఘాట్లు నిర్మించామన్నారు. త్వరలోనే సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో గుండె, క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.
– సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 9
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 9: “మీరే నా బలం..బలగం.. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది, జీవించినంత కాలం మీకు సేవ చేస్తానని’ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… మీ అందరినీ చూస్తుంటే పండుగలా అనిపిస్తోందన్నారు. ప్రతి ఊరి నుంచి ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన అక్కాచెల్లెమ్మలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తు న్నానని ఉద్వేగంగా మంత్రి ప్రసంగించారు. మీకు ఎంత సేవ చేసినా తక్కువేనని..మీరే నా బలం..బలగమన్నారు.
రాఘవాపూర్ అడ్డా..గులాబీ గడ్డ అని, సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారన్నారు. ఉద్యమం ప్రారంభించి రాదనుకున్న తెలంగాణను సాధించి చూపించారని గుర్తుచేశారు. కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయని, ఇదంతా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనతేనన్నారు. గతంలో వానలకోసం ఆలయాల్లో జలాభిషేకాలు చేశారన్నారు. కాలంతో పనిలేకుండానే కాళేశ్వరం నీళ్లు కండ్లముందు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15లో రూ.108 కోట్ల ధాన్యం పండితే ప్రస్తుతం రూ.1548 కోట్ల ధాన్యం పండించేస్థాయికి చేరుకున్నామన్నారు. ఏ మంత్రమో..అల్లావుద్దీన్ దీపం మాయో కాదని..కేసీఆర్ అనే అద్భుత దీపం మూలంగానే ఇది సాధ్యమైందన్నారు.
గతంలో ధాన్యం పండిస్తే కొనేటోళ్లు లేరని, ఇప్పుడు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కొంటున్నారని గుర్తు చేశారు. రూరల్ మండలంలోని అన్ని చెరువులు మత్తడి దుంకుతున్నాయని, ఇంకా ఏవైనా ఉంటే మరోరెండు నెలల్లో చెరువులు నింపుతామని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఇంట్లో కేసీఆర్ అనే పెద్ద కొడుకు ఉన్నాడని, తల్లికి, తండ్రికి పెద్ద కొడుకులా ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి ఇచ్చి పెద్దన్నలా మారారన్నారు. ఆదర్శ గ్రామాలుగా ఇర్కోడు, రాఘవాపూర్, పుల్లూరు, పెద్దలింగారెడ్డిపల్లి అవార్డులు వచ్చాయని, బుస్సాపూర్, తోర్నాల గ్రామాలకు నేషనల్ హైవేను తలదన్నేలా రోడ్లు వేశామన్నారు.
పుల్లూరు బండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. రైతులకు స్ప్రింక్లర్లు అందించామని, మహిళలకోసం ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలు అమలు చేస్తున్నామని, త్వరలో గృహలక్ష్మి పథకంలో జాగ ఉన్నవాళ్లకు ఆర్థికసాయం అందజేస్తామన్నారు. రూరల్ మండలంలోని ఇర్కోడు, బురుగుపల్లి, తోర్నాల వరకు నాలుగులేన్ల రహదారి వేసి బట్టర్ఫ్లై లైట్లు వేయిస్తామన్నారు. ప్రతిగ్రామంలో సీసీరోడ్లు వేశామని, బతుకమ్మ పండుగకు మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఘాట్లు నిర్మించామన్నారు. బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్నట్లు, తోర్నాలలో వ్యవసాయ కళాశాల, ఇర్కోడు ఆదర్శ పాఠశాల, రాఘవాపూర్ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిద్దిపేట దవాఖానను ఇంకా అభివృద్ధి చేస్తామని, సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మార్చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే సిద్దిపేట దవాఖానలో గుండె, క్యాన్సన్ రోగులకు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆదరణ, ప్రేమ ఉంటే చాలని, మీకు జీవితాంతం సేవ చేస్తూనే ఉంటానన్నారు.
ఏక్ దో తీన్మార్..బీఆర్ఎస్ ఔర్ ఏక్‌బార్
తెలంగాణకు అండా గులాబీ జెండా అని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ర ఆవడం ఖాయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ధీమా వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్‌కు ప్రధాని వస్తే, ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన పావులావంతు జనం రాలేదన్నారు. తెలంగాణ సాధించి చూపించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకే దక్కిందన్నారు. మల్లన్న సాగర్‌కు నీళ్లు వస్తాయని అనుకోలేదని..కాల్వలు, చెరువుల్లో కాళేశ్వరం జలాలు పారుతున్నాయని, అపర భగీరథుడు కేసీఆర్ అన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి హరీశ్‌రావు కష్టం వెలకట్టలేనిదన్నారు. సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. రంగనాయకసాగర్ నిర్మాణం, కోమటి చెరువు అభివృద్ధి రాష్ట్రంలోని మిగతా ప్రాం తాలకు రోల్‌మోడల్‌గా మారాయని గుర్తు చేశారు. వివిధ సంక్షేమ పథకాలపై సాయిచందర్గానం సభికులను ఆకట్టుకుంది.
పలకలు, క్రికెట్ కిట్లు పంచేటోళ్లను నమ్మరాదు
ఎన్నికలు వచ్చాయంటే ఆరునెలల ముందు గ్రామాలకు వచ్చి పలకలు, క్రికెట్ కిట్లు పంచేటోళ్లను నమ్మరాదని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో రూరల్ మండలం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రతి గ్రామంలో మంత్రి హరీశ్‌రావు చొరవతో గుడి, బడి, కుల సంఘాల భవనాలు , రోడ్లు నిర్మించుకుంటున్నామని గుర్తు చేశారు.
24 గంటలు ప్రజలకు ఏ ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే మంత్రి హరీశ్‌రావును మర్చిపోవద్దన్నారు. గత ఎన్నికల్లో ఏ గ్రామానికి రాకున్నా లక్షా 18 వేల మెజార్టీ ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు.
రూరల్‌లో ఆత్మీయ పండగ
సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంలో జరిగింది. రూరల్ మండలంలోని పల్లెలు సమ్మేళనానికి తరలివచ్చాయి. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సమ్మేళనంలో జనం మంత్రి ప్రసంగాన్ని, కవి, గాయకుడు సాయిచంద్ ఆటపాటలను ఆసక్తిగా విన్నారు. చాలారోజుల తర్వాత నిర్వహించిన అతిపెద్ద సమ్మేళనం సక్సెస్‌కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఎంపీపీ శ్రీదేవీరామచందర్రావు, జడ్పీటీసీ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు నిరంతరం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేసేందుకు ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారన్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత మంత్రి హరీశ్‌రావుకే దక్కుతుందన్నారు.
యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించారన్నారు.కాగా మంత్రి హరీశ్‌రావు మహిళలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, మహిళలు భోజనాలు చేసిన అనంతరం స్వగ్రామాలకు తరలివెళ్లారు. సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, బీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు యాదయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచందర్‌రావు, శ్రీనివాసరావు, బాలకిషన్‌రావు, బాల్‌లింగం, మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ వర్మ, వైస్ ఎంపీపీ యాదగిరి, మోహన్‌లాల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు హంసకేతన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పల్లె నరేశ్‌గౌడ్, సదాశిరెడ్డి, మహిళా సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నీళ్లకోసం 10 బోర్లు వేసినా చుక్క నీళ్లు పడలె. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం జలాల పారుతు న్నాయి. ఒకప్పుడు ఎవుసం పనులు మొదలైతే షావుకారి దగ్గరికి పోయే టోళ్లం. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇచ్చిన తర్వా త బంధు అయింది. ఏడాదికి రెండుసార్లు బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు పడుతుంది. ప్రజలు రైతుల వద్దే కూరగాయలు కొంటుర్రు.
– మధుసూదన్ , రైతు, ఇర్కోడు, సిద్దిపేట రూరల్ మండలం
కేసీఆర్, హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం
పేదలకు ప్రభుత్వం అన్ని పథకాలు వర్తింపజేస్తుంది. రైతు బంధు, పింఛన్ ఇస్తుండ్రు. యాసంగి ధాన్యం కొంటుర్రు. 24 గంటల కరెంట్ ఇస్తుండ్రు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సారుకు రుణపడి ఉంటాం. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది
పెట్టవట్టే. కేసీఆర్ వెనుకాలే మీమంతా ఉన్నాం. మళ్లీ కేసీఆర్ సారే గెలుస్తడు.
– ఎర్వ రాజయ్య, పుల్లూరు, సిద్దిపేట రూరల్ మండలం
మా ఊరు బాగుపడ్డది
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్ల మా ఊరు బాగుపడ్డది. ఒకప్పుడు ఊరికి రోడ్డు కూడా సరిగ్గా లేకుండే. చెరువులు, కుంటల్లో నీళ్లు లేవు. ప్రస్తుతం తాగేందుకు ఇంటింటికీ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ తీరు బాగుంది.
– రాజయ్య, చింతమడక, సిద్దిపేట రూరల్ మండలం