సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో ఏం జరుగుతున్నదంటూ ఎనర్జీ సెక్రటరీ నవీన్‌మిట్టల్ సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, సంస్థాగతంగా జరిగిన నష్టాన్ని కూడా పూరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సీఈఐజీ రాసిన లేఖను ఆధారంగా చేసుకుని ‘నమస్తే’లో వచ్చిన కథనం నేపథ్యంలో ఫోర్జరీలపై దృష్టిపెట్టాలంటూ ఎస్పీడీసీఎల్ సీఎండీకి నవీన్‌మిట్టల్ సూచించారు. ఈ క్రమంలో సీఎండీతోపాటు కమర్షియల్ డైరెక్టర్ కూడా ఆగస్ట్‌కు ముందు జరిగిన నకిలీల బాగోతం, అప్పుడు ఇచ్చిన కనెక్షన్లలో అప్లోడ్ చేయని సర్టిఫికేట్లు, నకిలీలకు సహకరించిన అధికారులను గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం సంస్థ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి గత నెలలోనే నమస్తే కథనాన్ని ఉదహరిస్తూ ఫోర్జరీలపై చర్యలు తీసుకోవాలనే ఉత్తర్వులను నవీన్ మిట్టల్ జారీ చేశారు.
ఎనర్జీ సెక్రటరీ ఆదేశాలతో మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న సీఈఐజీ కార్యాలయంతో పాటు టీజీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున అక్రమార్కులను గుర్తించే పనిలో విజిలెన్స్‌తో పాటు చీఫ్ ఇన్స్పెక్టర్లు తలమునకలయ్యారు. ఇద్దరు కాంట్రాక్టర్లకు సంబంధించిన ఫోర్జరీ సర్టిఫికెట్‌ను ‘నమస్తే’ తెలంగాణ బయటపెట్టగా దాని ఆధారంగా వారిపై కేసు నమోదు చేయాలంటూఉన్నతాధికారులు సీఈఐజీకి సూచించారు. దీంతో సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాంట్రాక్టర్లపై గతనెల 21న సీఈఐజీ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది కూడా నకిలీ సర్టిఫికెట్లు పెట్టడం, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడంతో వారిని కూడా కనిపెట్టే పనిలో పడ్డారు. మరోవైపు ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో వారిని కూడా పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా నమస్తే వెలుగులోకి తెచ్చిన ఆ ఇద్దరిపైనే కేసు పెట్టి వదిలేశారు. అంతేకాకుండా ఆ ఇద్దరిలో ఒకరితో చీఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు క్షమాపణలు రాయించుకుని మీపై కేసు లేకుండా చేస్తామంటూ లావాదేవీలు చేసినట్లు విద్యుత్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే వ్యవహారంలో మరికొందరు నకిలీలను గుర్తించినప్పటికీ తమ నుంచి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి నకిలీలని చూపించిన వాటిలో కొంతమందిని తప్పించి వారి వద్ద ఉన్నతాధికారికి అనుకూలంగా ఉండే ఓ సాంకేతిక అధికారి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నట్లు విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల మధ్య చర్చ జరుగుతోంది.
‘నమస్తే’లో కథనం వచ్చిన తర్వాత దక్షిణడిస్కంలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో కనెక్షన్లు తీసుకున్న వ్యవహారంపై కలకలం రేగింది. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని పలుచోట్ల ఎక్కడెక్కడ డిప్యూటీ సీఈఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కనెక్షన్ల కోసం ఆ డాక్యుమెంట్లను ఉపయోగించారో తెలుసుకునే దిశగా దక్షిణ డిస్కం విజిలెన్స్ విభాగం నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలలో సుమారు 54మంది అధికారులు ఫోర్జరీ డాక్యుమెంట్స్ విషయంలో నకిలీగాళ్లతో కుమ్ముక్కయినట్లు ప్రాథమికంగా నిర్ధారించి వారికి నోటీసులు జారీ చేశారు. అంతే.. వ్యవహారం ఇక్కడితో ఆగిపోయింది. ఫోర్జరీ వ్యవహారం ఒక్క సరూర్‌నగర్ నుంచి మొదలైనా మిగతా చోట్ల జరిగిన దానిపై అటు సీఈఐజీ కానీ, ఇటు డిస్కం కానీ మొదట్లో చేసిన హడావిడి మళ్లీ కనిపించకపోవడం గమనార్హం.