హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని మంత్రి సీతక పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏజెన్సీ ప్రాంతాల మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సీతక మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒకరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రతి సర్పంచ్ తన గ్రామానికి ఏం చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్చార్డీ డీజీ శాంతికుమారి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, శిక్షణ కోఆర్డినేటర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.