దుబ్బాక, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం దద్ధరిల్లింది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకుండా కొందరు కాంగ్రెస్ నాయకులు సభావేదికపైకి రావడంతో గొడవకు దారితీసింది.
దుబ్బాకలోని రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమానికి ముఖ్యఅథితిలుగా అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు. మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మంత్రికి దుబ్బాక చేనేతల నూలు దండతో సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని అధికారులు సభావేదికపైకి ఆహ్వానించడంతో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.
ప్రభు త్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించాలని, ఇది పార్టీ కార్యక్రమం కాదని నిర్వాహకులకు సూచించారు. సభా వేదికపై నుంచి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లకపోతే బీఆర్ఎస్ నాయకులు సైతం వస్తారని సూచించారు. ఈ క్రమంలో వేదికపైనే ఉన్న కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు హోరాహోరీగా నినాదాలు చేశారు. సభా ప్రాంగణం వద్ద తోపులాట జరిగింది. వీరితో పాటు బీజేపీ శ్రేణులు సైతం నినాదాలు చేయడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో మంత్రి సురేఖ ఒకరిద్దరు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి అర్ధంతరంగా వెళ్లిపోయింది.
సభ ప్రాంగణం ఎదుట నాయకుల నినాదాలు, తోపులాటలతో కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఫంక్షన్ హాల్లోకి కేవలం లబ్ధిదారులకు మాత్రం ప్రవేశం అంటూ పోలీసులు కాంగ్రెస్ నాయకులను పంపించారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను సభలోకి పంపకుండా అడ్డుకున్నారు. మీడియా వారిని సైతం అడ్డుకుని అత్యుత్సాహం చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదింటి ఆడపిల్లల పెండ్లికి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందని, రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని పెంచి ఇస్తామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం మహిళలకు అదృష్టంగా మారిందని పేర్కొ న్నారు. దుబ్బాక చేనేతలకు అండగా ఉంటానని, చేనేత కార్మికులకు ఉపాధి మార్గాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశంగా నిర్వహించారంటూ లబ్ధిదారులు మండిపడ్డారు.