మెదక్, జూన్ 13(నమస్తే తెలంగాణ): మెరుగైన రవాణా సౌకర్యం కలిపించేందుకు నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ ప్రాంతాల మీదుగా వెళ్లే ఎన్‌హెచ్ 765డీ జాతీయ రహదారిని రూ. 213 కోట్లతో రెండు వరుసలుగా విస్తరిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి నర్సాపూర్, మెదక్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. మెదక్ వైపు నుంచి కామారెడ్డి జిల్లా వైపు రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెదక్ పట్టణం నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు మెదక్ జిల్లాలో 20 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి ఉంది.
2024 ఆగస్టు 21న ఎన్హెచ్ఏఐ అధికారులు ఈ రోడ్డు పనులు ప్రారంభించింది. 24 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు గడువు విధించగా, 2026 ఆగస్టు చివరి వరకు పనులు పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలో అటవీ ప్రాంతం ఉండడంతో కేంద్రం నుంచి అనుమతులు రాక రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. కొన్నిచోట్ల భూ సమస్యలతో అటవీశాఖ అనుమతులు రాక రోడ్డు పనులు వేగంగా సాగడం లేదు. పోచారం అభయారణ్యం 6.1 కిలో మీటర్లు ఉండగా, అటవీ ప్రాంతం 7.73 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు రావాల్సి ఉంది. రోడ్డుపై కొత్తగా నిర్మాణం చేస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు.
కొన్నిచోట్ల బ్రిడ్జీలు, రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఈ రోడ్డు పనులు పూర్తయితే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మెదక్ చర్చి, మెదక్ కోట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి జరిగింది. పోచారం ప్రాజెక్టు కింద బ్రిడ్జి ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అక్కడ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి. హవేళీ ఘనపూర్ మండలంలోని శాలిపేట శివారులో జాతీయ రహదారి పై నిర్మాణం చేస్తున్న బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని టోల్‌ప్లాజా నిర్మాణం చేస్తున్నారు.
జాతీయ రహదారి విస్తరణతో హైవే వెంట వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మెదక్ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోచారం డ్యామ్‌కు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యంగా మారుతుంది. రైతులు పండించిన ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా ఉంటుంది. రోడ్డు పూర్తయితే తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రకు వస్తువులు రవాణా చేసేందుకు రవాణా సులభతరంగా మారుతుంది.
మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు జాతీయ రహదారి విస్తరణ పనులకు అటవీశాఖ అనుమతులు రాక మధ్యలో నిలిచిపోయాయి. రోడ్డుపై కల్వర్టులు నిర్మాణం చేపట్టాం. కొన్ని చోట్ల భూ సమస్యతో బ్రిడ్జిల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించాం. పోచారం డ్యామ్ వద్ద బ్రిడ్జి ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పెండింగ్ పనులు ప్రారంభిస్తాం. పోచారం అభయారణ్యంలో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రెండు వరుసల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– ప్రవీణ్‌రెడ్డి, డీఈఈ నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా, మెదక్ డివిజన్
అటవీశాఖ నుంచి జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతులు రాక హవేళీఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యం ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభం లేదు. జాతీయ రహదారిని రెండు వరుసలుగా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మెదక్ నుంచి శాలిపేట శివారు వరకు రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతుండగా, మధ్యలో బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. అటవీశాఖ అనుమతులు రాకపోవంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టడం లేదు. మెదక్ నుంచి హవేళీఘనపూర్ మండలంలోని రోడ్డు నిర్మాణం వేగవంతంగా సాగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు ఆగస్టు వరకు ఉండగా, ఇంత వరకు సగం పనులు పూర్తి కాలేదు.