సిద్దిపేట, ఫిబ్రవరి 26 : సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయంలో సమీక్ష నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఈ ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిందన్నారు. 1971 లో పెద్దజీయర్ స్వామి వారిచే ప్రతిష్ఠ జరిగిందని, 1991లో చినజీయర్ స్వామి స్వహస్తాలతో ఆలయ గోపుర ప్రతిష్ఠ జరిగినట్లు తెలిపారు.
ఇప్పుడు అర్ధ శతాబ్దపు ఉత్సవాలు చినజీయర్ స్వామితో జరగడం మన అదృష్టమని, ఇందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని కోరారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన కొమ్మ వెంకటేశం, జిల్లా వెంకటేశం, సోహన్‌లాల్, పబ్బ చంద్రయ్య, వారి కుటుంబాలను, ఆలయాభివృద్ధికి పాటుపడిన వారిని సన్మానం చేసుకుందామని పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని హరీశ్‌రావు కోరారు.
చినజీయర్ స్వామి పర్యవేక్షణలో మే 21న కల్యాణోత్సవం, 22న మహా కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాలకు తనవంతుగా హరీశ్‌రావు లక్ష రూపాయల విరా ళం ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, తదితర నాయకులు పాల్గొన్నారు.