సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ సదాశివపేట, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సదాశివపేట పట్టణంలోని ఊబచెరువు, మెగిలిపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏనాడూ కుల వృత్తులను పట్టించుకోలేదన్నారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా కులవృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ హయాంలోనే కులవృత్తులను ప్రోత్సహిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనియ్యడంతో, ప్రస్తుతం వారు ఉపాధి పొందుతూ ఇతరులకు జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్‌గౌడ్, సాతాని శ్రీశైలం, విద్యాసాగర్‌రెడ్డి, చౌదరిప్రకాశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు చీల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం తదితరులు పాల్గొన్నారు.
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని డబ్బులు పంచిపెట్టినా మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సదాశివపేట మండలంలోని చెరువుల్లో ఉచిత చేప పిల్లలను వదిలిపెట్టిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను విశ్వసించటం లేదన్నారు. బీజేపీ గురించి నిత్యం ప్రగల్భాలు పలికే ఈటల రాజేందర్ ఇటీవల నర్సాపూర్‌లో నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ కావటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆ సభకు జనం హాజరుకాలేదని, నర్సాపూర్ నియోజకవర్గంలోని ఏ ఒక్క సర్పంచ్ బీజేపీలో చేరలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజల అండదండలతో బీఆర్ఎస్ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆకర్శిస్తున్నట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నా, రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభు త్వం ఇస్తున్న అవార్డుల్లో మెజార్టీ తెలంగాణకు దక్కుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ తొలి విజయం మునుగోడు నుంచి ప్రారంభమవుతుందన్నారు. మునుగోడులో కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజే పీ ఎమ్మెల్యేలు, నాయకులు పర్యటిస్తూ డబ్బులు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని డబ్బులు పంచినా మునుగోడులో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుపొందటం ఖాయమన్నారు. దేశంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్‌తో బాధపడిన ప్రాంతం మునుగోడు అని, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫ్లోరైడ్ సమస్యపై పోరాటం చేశారని గుర్తుచేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్ మునుగోడుకు తాగునీటి పథకాన్ని తీసుకువచ్చి ఫ్లోరైడ్‌ను తరిమికొట్టారని చెప్పారు. మునుగోడు అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్)కి మునుగోడు ప్రజలు అండగా ఉన్నట్లు తెలిపారు.
బసవేశ్వర, సంగమేశ్వర అడ్డుకునే కుట్ర
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాకు తీసుకువచ్చేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారన్నారు. రెండు ఎత్తిపోతల నిర్మాణాలకు వీలుగా టెండర్లు ఖరారు చేయగా, బీజేపీ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణం జరగకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించినట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు ఇవ్వటంలేదని, నిర్మాణానికి అవసరమైన నిధులు రాకుండా అడ్డుపడుతున్నట్లు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయటం ఖాయమన్నారు.