సిద్దిపేట, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు సమీప కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మూడోస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిలిచారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువపత్రాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అందుకున్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ గెలవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. మెదక్ పార్లమెంట్ కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠను నిలిపింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని బీజేపీకి 4,71,217 ఓట్లు, కాంగ్రెస్‌కు 4,32,078 ఓట్లు, బీఆర్ఎస్కు 3,96,790 ఓట్లు వచ్చాయి. మొత్తం 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థి 2,7,14,21,22 రౌండ్లలో, బీఆర్ఎస్ 1,4,5,19 రౌండ్లలో మెజార్టీ సాధించగా మిగతా అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ బీజేపీ అభ్యర్థి మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొత్తం 14,315 ఓట్లు పోల్ కాగా వీటిలో కాంగ్రెస్ అభ్యర్థికి 4,179 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 7,440 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 1,540 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 3,261 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇన్వాల్యుడ్ కింద 307 ఓట్లు, రిజెక్టు కింద 665 ఓట్లు చెల్లకుండా పోయాయి. నోటాకు 35 ఓట్లు పోలయ్యాయి.