మెదక్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ పనిచేస్తున్నదని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం మెదక్‌లోని పిల్లికోటాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ… త్వరలో రాష్ట్రంలో మరో ఐదు క్యాన్సర్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రస్తుతం డయాబెటీస్, క్యాన్సర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువ మంది బాధపడుతున్నారని, వీటిపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్యాన్సర్ కోసం ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో ఐదు క్యాన్సర్ సెక్టార్లను ఏర్పాటు చేసి ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానను హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 74 ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో, ప్రతి మండల స్థాయిలో వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళిక ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిపారు.
మెదక్‌లో 220 పడకల దవాఖాన భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, అన్ని రకాల మౌలిక వసతులను వచ్చే విద్యా సంవత్సరం వరకు అందుబాటులోకి తెస్త్తామని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు విజయవంతంగా కోర్సు పూర్తిచేసి వృత్తికి న్యాయం చేయాలన్నారు. మెదక్ మెడికల్ కళాశాలకు అవసరమైన నర్సింగ్, పారామెడికల్ కళాశాల మంజూరు చేయాలని మంత్రి దామోదర్‌ను ఆమె కోరారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 387 నూతన మెడికల్ కళాశాలను మంజూరు చేసిందన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. మెదక్ ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. స్వతహాగా తాను వైద్యుడిని అని, మెదక్ జిల్లా ప్రజల కష్టనష్టాలు తెలిసిన వాడిగా మీ కష్టాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. గతేడాది బీఆర్ఎస్ హయాంలో మెదక్‌కు మెడికల్ కళాశాలను అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ , డీఎంఈ డాక్టర్ వాణి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ..మెదక్ వెనకబడిన ప్రాంతానికి మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవ డం సంతోషంగా ఉందని, కేసీఆర్ మెదక్‌కు మెడికల్ కళాశాల మంజూరు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మొదటి విడతలో మెదక్‌కు మెడికల్ కళాశాల మం జూరు కాలేదని, రెండో విడతలో మెడికల్ కళాశాలను కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటుతో హైదరాబాద్ లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లకుండా వైద్యం అందుబాటులో వస్తుందని తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సులో పూర్తిస్థాయిలో సీట్లు నిండడం, అందులో ఎక్కువ మంది విద్యార్థినిలు ఉం డడంతో ఈ ప్రాంత ప్రజలకు ఓపికతో వైద్యం అం దించే డాక్టర్లు తయారవుతారని సంతోషం వ్యక్తం చేశా రు. రాజకీయాలు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృ ద్ధి చేసుకోవాలని, నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని, పూర్తిస్థాయి భవన నిర్మాణం చేపట్టాలని మంత్రులను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కోరారు.