తొగుట, మార్చి 21: వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలేకుండా చేస్తాయి. అదే వేసవిలో లోతు దుక్కులతో (Summer Sorrows) బోలెడు లాభాలు ఉన్నాయి. దీంతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వర్షాలకు ముందు భూమిని దున్నడం వల్ల తొలకరి వానలు పడగానే నీరు భూమిలోకి ఇంకి కోతకు గురికాకుండా ఉంటుంది. వేసవి కాలంలో లోతు దుక్కులతో భూమి పైపొరలు లోతు దుక్కులతో చాలా ప్రయోజనాలున్నాయని అధికారు చెబుతున్నారు.
ఖరీఫ్‌లో వర్షం కురియగానే పంట పొలాల్లో ఉన్న చెత్తా చెదారంను తొలగించడం, దుక్కులు చేసి విత్తనాలు విత్తడం సాదారణంగా రైతులు చేస్తుంటారు. పిచ్చి మొక్కలతో నిండిన పొలంలో అప్పుడే దున్ని దుక్కి చేసి విత్తనాలు నటితే పంట చేలుకు సక్రమంగా పోషకాలు అందకుండా ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే ఏడాది క్రితం సాగు చేసిన పంట చేలు తాలూకూ వర్షాకాలంలో దుక్కి చేసే వరకు అలానే ఉండటంతో పంట చేలుకు సోకిన తెగుళ్లు, చీడ పీడలు దాన్ని పట్టుకొనే ఉండటంతో ఖరీఫ్‌లో సాగు చేసే పంటకు సోగడంతో రైతులు పంట నష్టపోతున్నారు. ఖరీఫ్ పంట తర్వాత సాగు చేసుకొనే అవకాశం లేని పంట పొలాల్లో అడపా దడపా వర్షాలు కురిసినపుడు వేసవి దుక్కులు చేసుకోవడంతో నీరు ఇంకి తేమ శాతం పెరగడంతో పాటు, కలుపు, చీడ పీడల ఉదృతి తగ్గుతుంది. గత కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురియడంతో రైతులు వేసవి దుక్కులు చేస్తూ బిజీగా ఉన్నారు.
వేసవి దుక్కులు చేసుకోవాలంటే నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉన్నవారు దుక్కిని పారపెట్టి దుక్కులు చేసుకోవచ్చు. అడపా దడపా వర్షాలు కురిసినపుడు కూడా దుక్కులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడ్లతో కాకుండా ట్రాక్టర్ ద్వారా పెద్ద నాగళ్లతో (ప్లవ్)తో లోతు దుక్కులు చేస్తే ఎంతో ఉపయోగకరం. నేలకు 25-70 సెంమీ లోతుగా దుక్కులు చేసుకోవాలి. కల్టివేటర్, రోటావేటర్తో తక్కువ లోతు దుక్కి కావడంతో పెద్దగా ఉపయోగం కాదు. మెట్ట భూములను ప్లవ్తో దున్నడం మంచిది. దీనితో చెత్తా చేదారం భూమి లోపలికి పోయి కుళ్లి పోవడంతో పాటు వర్షం కురిసినపుడు నీరు భూముల్లోకి చేరి పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. ప్లవ్తో దున్నిన భూమిని వర్షం పడ్డాక కల్టివేటర్, రోటా వేటర్‌తో దుక్కి చేసుకోవాలి. గడ్డి ఎక్కువగా పడుతున్న నేలలో డిస్క్ప్లవ్తో దుక్కి చేస్తే మేలు జరుగుతుంది.
రసాయన ఎరువుల వాడకం మూలంగా పంట పొలాలు నిర్జీవమవుతాయి. భూమిలో సారం కోల్పోయి పోషకాలను కోల్పోయే స్థితి ఎదురవుతుంది. సేంద్రీయ ఎరువుల వాడకం మూలంగా భూసారం పెరుగుతుంది. వేసవిలో దుక్కులు చేసే ముందు పంట పొలాల్లో గొర్రెలు, మేకలు, పశువుల మంద పెట్టించాలి. అవి విసర్జించే మల మూత్రాలు భూమిలోకి చేరి భూసారం పెరుగడంతో పాటు పంట పొలాల్లో ఏర్పడే సూక్ష్మ పోషక లోపాలను నివారించవచ్చు. చెరువుల నల్లమట్టి, కంపోస్టు, చెట్ల ఆకులు చల్లి దుక్కులు చేసుకుంటే ఈసేంద్రీయ పదార్థం భూమి క్రింది పొరల్లోకి చేరి నేల గుల్లబారుతుంది. తద్వారా నీటి నిలువ సామర్ధ్యం పెరుగడంతో పంట దిగుబడి పెరుగుతుంది.
సాదారణంగా పంటలు సాగు చేయని సమయంలో కలుపు మొక్కలు పెరగడంతో సాగు సమయంలో ఇబ్బంది కరంగా మారుతాయి. ఈ కలుపు మొక్కలు నేలలోని నీరు, పోషకాలను ప్రత్యక్ష్యంగా గ్రహించి పంట దిగుబడి తగ్గిస్తాయి. అనేక రకాల పురుగులకు శిలీంద్రాలకు కలుపు మొక్కలు ఆవాసాలుగా మారుతాయి. వేసవి దుక్కుల మూలంగా కలుపు మొక్కల నివారణ జరగడంతో పాటు కలుపు మొక్కల విత్తనాలు, సూక్ష్మ జీవులు నేలపైకి లేచి ఎండకు నశిస్తాయి.
నేల ఏటవాలుగా ఉండి కోతకు గురవుతుంటే వేసవి దుక్కి వాలుకు అడ్డంగా దున్నాలి. తద్వారా వర్షాలు కురిసినపుడు భూసారం కొట్టుకుపోదు. వర్షపు నీరు భూ పొరల్లోకి చేరి పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. లోతు దుక్కుల్లో మొక్కలు త్వరగా అంటుకోవడంతో పాటు వేరు వ్యవస్థ బలపడి అధిక పోషకాలను గ్రహిస్తాయి. నేల లోపలి పోరల్లో పంటకు హాని చేసే క్రిములు, ఇతరత్రా చీడ పీడల లార్వాలు భూ పై పొరల్లోకి రావడం వలన ఎండ వేడికి నశిస్తాయి. దుక్కుల ద్వారా అణువుల్లోకి గాలి వెలుతుంది. ఆరోగ్యవంతమైన నేలకు సంబంధించి మట్టి రేణువుల్లో 50 శాతం నీరు, 20 శాతం గాలి ఉండాలి. నేలను తిరగ వేయడం వలన చీడ పురుగులను పక్షులు ఏరుకొని తినే అవకాశం ఉంది. సేంద్రీయ పదార్థాలు విచ్చిన్నం అయి పోషకాలు విడుదల అవుతాయి. దీనితో పంట చేలు బలంగా ఎదుగుతుంది.
వేసవి దుక్కులు దున్నడం మూలంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని తొగుట మండల వ్యవసాయాధికారి మోహన్ అన్నారు. వేసవి దుక్కులు దున్నడం మూలంగా రైతులకు చేకూరే ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్నాం. మార్చి, ఏప్రిల్ మాసాలలో దుక్కులు చేసుకుంటే చీడ పీడలు నశిస్తాయి. నీటి నిల్వ సామర్ధ్యం పెరిగి, భూసారం పెరుగుతుంది. తద్వారా పంట దిగుబడులు పెరుగుతాయి.