గజ్వేల్, జూన్ 18: సాగుకు సిద్ధమవుతున్న రైతన్నకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద తప్పడం లేదు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కాలం చెల్లిన, నకిలీ విత్తనాలను అంటగడుతూ దండిగా దోచుకుంటున్నారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు అమ్మవద్దని వ్యవసాధికారులు సూచిస్తున్నా, వారి మాటలు పెడచెవిన పెడుతూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిఘా పెట్టాల్సిన అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి.
విత్తనాలు కొనేందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రానికి గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, మర్కూక్, రాయపోల్, దౌల్తాబాద్, ములుగు మండలాలకు చెందిన వేలాది మంది రైతులు వస్తుంటారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు సాగుచేస్తారు. గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో గ్రామాల్లో ఎక్కువగా రైతులు వరి, పత్తి పంటలు సాగు చేస్తుంటారు. వర్గల్, ములుగు, మర్కూక్ మండలాల్లో మాత్రం రైతులు వరి, పత్తితో పాటు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేస్తారు. ఈ ప్రాంత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు కాలం చెల్లిన, నకిలీ కంపెనీల విత్తనాలతో పాటు అనుమతులు లేని వాటిని కట్టబెడుతున్నారు.
దీంతో రైతులు పంటసాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన విధంగా దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని విత్తనాలు ఏపుగా పెరిగిన తర్వాత రైతులను ఊరించి అసలు పూత, కాత లేకుండా దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో చాలానే ఉన్నాయి. గతేడాది జగదేవ్‌పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు గజ్వేల్‌లో కర్బుజా విత్తనాలు కొని పంట సాగు చేశాడు. తీరా సమయానికి కాత రాకపోవడంతో వ్యవసాయ అధికారులను ఆశ్రయించాడు. గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన రైతు గజ్వేల్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో మొక్కజొన్న (బుట్ట) విత్తన ప్యాకెట్లు కొన్నాడు. విత్తనాలు విత్తే సమయంలో ప్యాకెట్ తెరిచి చూడగా అందులోని బుట్ట మొక్కజొన్న విత్తనాలు పురుగులు పట్టి పుచ్చుతో ఉన్నాయి.
వెంటనే ఆ విత్తన ప్యాకెట్‌ను తీసుకుని దుకాణదారుడి వద్దకు వెళ్లగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం దుకాణాల్లో తనిఖీలు చేసే సమయంలో నిర్లక్ష్యంగా, తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇన్ని జరిగినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కేవలం రికార్డులు తనిఖీ చేయడానికే వారు పరిమితమవుతున్నారు తప్పా కాలం చెల్లిన, నకిలీ విత్తనాలను గుర్తించడంతో విఫలమవుతున్నరనే ఆరోపణలున్నాయి.
రెండేళ్ల క్రితం గజ్వేల్‌లోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో కాలం చెల్లిన వరి, మెంతులు, గంగవాయిలి కూర, బీర్నిస్తో పాటు కాలం చెల్లిన పురుగుల మందులను పోలీసులు పట్టుకున్నారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలను పట్టుకుని వ్యవసాయాధికారులకు అప్పగించారు. ప్రజ్ఞాఫూర్లోని రైతు సేవా కేంద్రంలో కాలం చెల్లిన విత్తనాలు పట్టుకున్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో బీటీ-3 విత్తనాలు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ఏటా జరుగుతున్నా వ్యవసాయాధికారులు మాత్రం మేల్కోవడం లేదు. రైతులు ఫిర్యాదు చేసినా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్గల్ మండలంలో అనుమతిలేని బీటీ విత్తనాల విక్రయాలు కొనసాగుతున్నాయన్న సమాచారం మేరకు 2019 ఏప్రిల్‌లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి మాదారం, అంబర్‌పేట, దండుపలికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.