రామాయంపేట, ఫిబ్రవరి 22 : అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేస్తే జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే బ్యాంకులో ఉన్న సొమ్ము ఖాళీ అవుతుందని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం రామాయంపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి ఓ దుండగుడు కాల్ చేసి.. మీ దుకాణానికి సంబంధించిన శానిటరీ వస్తువులను తక్కువ ధరకే అందిస్తామని బురిడీ కొట్టించాడని తెలిపారు.
అపరిచిత వ్యక్తి మాటలు నమ్మిన వ్యాపారి రూ.67,400 పోగొట్టుకున్నాడని సీఐ వెంకటరాజగౌడ్ పేర్కొన్నారు. అప్రమత్తమైన వ్యాపారి వెంటనే 1930 కాల్ చేశాడని చెప్పారు. కానీ అప్పటికే సైబర్ నేరగాడు ఆ డబ్బుతో ఇతర వస్తువులు కొనేందుకు ఉపయోగించాడని చెప్పారు. ఇలా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్కిల్ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు సైబర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇకపై అలా జరగకుండా ఉండాలనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ఒకటికి రెండు సార్లు చూసుకుని లిఫ్ట్చేయాలని తెలిపారు.