నర్సాపూర్/గజ్వేల్, జూలై 26: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వానకాలం సీజన్ కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం ఆయన మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించారు. గజ్వేల్‌లోని ఐవోసీ సమావేశ మందిరంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, గజ్వేల్ ఆర్డీవోతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి శరత్ మాట్లాడుతూ… వానకాలం నేపథ్యంలో ప్రజలు జబ్బుల బారినపడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఏదైనా ఒక గ్రా మంలో అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాల బారినపడితే వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలన్నారు. వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఒకేసారి యూరి యా కొనుగోలుకు వచ్చే సమయంలో దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారి, ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో నిఘా పెట్టాలన్నారు.
కలెక్టర్ ఒక్కరే జిల్లాలో 50 గురుకులాలతో పాటు పాఠశాలలను తనిఖీ చేశారని, అదే విధంగా జిల్లా అధికారులు తనిఖీలు చేయాలన్నారు. ఎరువుల పంపిణీ, దవాఖానలు, గురుకుల విద్యాలయాలు, వసతిగృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి కాలువలు, బ్రిడ్జీలు పొంగి ప్రవహిస్తే ప్రజలు అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్ల నుంచి ప్రజలను ముందే గుర్తించి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపాలన్నారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని, మండల ప్రత్యేక అధికారులు చెరువులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అంతకుముందు ప్రత్యేకాధికారి శరత్ నర్సాపూర్ రాయారావు చెరువును పరిశీలించి వరద ఉధృతిపై ఆరా తీశారు. శివ్వంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆయన వెంట ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.