ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వేపై బీసీలు మండిపడుతున్నారు. తమ జనాభాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపెట్టిందని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీల ఆగ్రహం
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వేపై బీసీలు మండిపడుతున్నారు. తమ జనాభాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపెట్టిందని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాల్లో, అధికారంలో న్యాయమైన వాటా కోసం కొట్లాడుతున్న తమకు ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి సర్వే పేరుతో ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఫలితాలు మొదటికే మోసం వచ్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాభాలో తాము 60 శాతానికి పైబడి ఉన్నామని, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా తమకు కనీసం 42శాతం కోటా అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, 60శాతం లేరని కాంగ్రెస్ సర్కారు తన సర్వేతో తేల్చిపారేయడం తమనెంతో బాధించిందని బీసీలు ఆవేదన చెందుతున్నారు. తమకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తమ న్యాయమైన వాటాను ఇవ్వడం ఇష్టంలేక సీఎం రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని బీసీ నాయకులు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఫిబ్రవరి 7
బీసీలపై కాంగ్రెస్ కుట్ర
రామాయంపేట, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ సర్కార్ కులగణన సర్వే తప్పుల తడకగా చేయించింది. 60 శాతం ఉన్న బీసీలను కేవలం 42 శాతమే ఉన్నట్లు సర్వేలో చూపింది. దీనివెనుక కాంగ్రెస్ సర్కారు కుట్ర దాగి ఉన్నది. రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచాల్సి వస్తదని తూతూ మంత్రంగా సర్వేలు చేయించింది. బీసీలు మరో ఉద్య మం చేపట్టాలి. బీసీలంతా ఏకమై ఉద్యమం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో 52శాతం రిజర్వేషన్లు కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోటా బీసీలకు దక్కాలి. లేకపోతే పోరాటం తప్పదు.
-ర్యాకల శేఖర్‌గౌడ్, రాష్ట్ర గీత కార్మిక సంఘం నాయకుడు, మనోహరాబాద్.
సీఎం ప్రకటన హాస్యాస్పదం
చేర్యాల, ఫిబ్రవరి 7: సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీసీ కులగణనపై తీర్మానం చేయకుండా చేసినట్లు బిల్డప్ ఇచ్చారు. 42శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామనడం హాస్యాస్పదం. పార్టీపరమైన విషయాలను అసెంబ్లీలో ఎందుకు ప్రకటించాలి. కులగణన సక్రమంగా జరగలేదు. రీసర్వే చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రవర్ణాల జనాభా లెక్కలు ఎక్కువ చూపి బీసీల లెక్కలు తక్కువ చూపడం ఎంతమేరకు సమంజసం. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతాం.
– పచ్చిమడ్ల మానసగౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర మహిళా వర్కింగ్‌ప్రెసిడెంట్, చేర్యాల (సిద్దిపేట జిల్లా)
కులగణన తప్పుల తడక
సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 7: కాం గ్రెస్ సర్కార్ చేపట్టిన బీసీ కుల గణన తప్పుల తడక. ప్రభుత్వం లెక్క లు మార్చి తప్పుగా చూపి వాస్తవ లెక్కలను విస్మరించింది. 60శాతం ఉన్న బీసీలను 46 శాతానికి పరిమితం చేయడం శోచనీయం. తెలంగాణలో 3.35 కోట్ల మంది బీసీ ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్ చెబుతుంటే, సర్వేలో మాత్రం రాష్ట్ర జనాభా 3.54 కోట్ల చూపడం నమ్మశక్యంగా లేదు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు ఇవ్వాల్సి వస్తుందని తప్పుడు లెక్కలు చూపించింది. పదేండ్ల క్రితం సమగ్ర కుటుంబ సర్వేలో 52శాతం బీసీలు ఉన్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క లు తీస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 46 శాతం ఉన్నారని చెప్పడం దారుణం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉండాలి.
కొమురవెల్లి, ఫిబ్రవరి 7: కాం గ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా బీసీ కులగణన చేసింది. పారదర్శకత పాటించలేదు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఒక్క రోజులో చేపట్టిన సర్వేను గమనిస్తే…ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే మొత్తం తప్పుల తడక అని అర్థమవుతుంది. కాంగ్రెస్ నాయకులే ప్రభుత్వం చేసిన సర్వే కరెక్ట్‌గా లేదని చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బీసీలను అణగదొక్కే విధంగా ఫేక్ సర్వే చేయించింది. కాంగ్రెస్ చేపట్టిన సర్వే అగ్రకులాల సర్వేలాగా ఉంది. ఇలాంటి సర్వేలతో బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే చేయించాలి. ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి.
-కొండపాక కనకయ్య, బీసీ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, కొమురవెల్లి
గ్రామాల వారీగా బీసీ జనాభా ప్రకటించాలి..
రామాయంపేట, ఫిబ్రవరి 7: రాష్ట్ర జనాభాలో బీసీలు 60శాతం పైనే ఉన్నారు. ప్రభుత్వం బీసీ జనాభాను తక్కువగా చూపి స్థానిక ఎన్నికల్లో అన్యా యం చేయాలని చూస్తున్నది. గ్రామాల వారీగా బీసీ జనాభాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. 56శాతం బీసీలు ఉన్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. ప్రస్తుత ప్రభుత్వం బీసీల జనాభా 46 శాతంగా చూపడం సరికాదు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఓటుతో బుద్ధితో చెబుతాం.
– మ్యాకల జయరాములు, పద్మశాలి సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు
బీసీలకు న్యాయం చేయాలి..
రామాయంపేట, ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలి. సర్వేలో తీవ్ర అన్యాయం జరిగింది. సమగ్ర కులగణన సర్వే జాతీయ స్థాయిలో చేపట్టాలి. దేశంలో అధికం శాతంగా ఉన్న బీసీలకు అన్నిరంగాల్లో అన్యాయం జరుగుతున్నది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జనాభా కోటా ప్రకారం న్యాయం చేయాలి.
-మెట్టు గంగారాం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, మెదక్
బీసీలకు తగిన వాటా దక్కాలి..
రామాయంపేట, ఫిబ్రవరి 7: బీసీల జనాభా తక్కువగా చూపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదు. ప్రభుత్వం సరిగ్గా సర్వే చేపట్టలేదు. బీసీలు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం. బీసీలు తిరగబడితే ప్రభుత్వం పతనం ఖాయం. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన వాటా దక్కాలి.
– సంగు స్వామి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు, మెదక్
మళ్లీ సర్వే చేయించాలి..
హుస్నాబాద్ టౌన్, ఫిబ్రవరి 7: బీసీల జనాభాను తక్కువచేసి చూపించడం ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్యగా బీసీలు భావిస్తున్నారు. ఇలాం టి చర్యలు బీసీల హక్కులను కాలరాయడమే. తక్షణమే కులగణను రద్దుచేసి తిరిగి సర్వే చేయించి బీసీలకు న్యాయం చేయాలి. కేవలం ఒక వర్గానికి మేలు చేసే విధంగా కులగణన చేసిన విషయం స్పష్టంగా తెలుస్తున్నది. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కులగణనలో బీసీల సంఖ్య తగ్గించిన విషయంపై మాట్లాడకపోవడం సరికాదు.
– కొమురయ్య, తెలంగాణ కల్లుగీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు, సిద్దిపేట
సర్వే లోపభూయిష్టం..
కాంగ్రెస్ సర్కారు చేయించిన కులగణన సర్వే లోపభూయిష్టం గా ఉంది. జనాభా లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయి. బీసీలకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. బీసీల జనాభా తక్కువ చేసి చూపించి ఆవర్గాలకు తగిన ఫలాలు అందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ప్రభుత్వం గందరగోళాన్ని క్రియేట్ చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు అన్యాయం చేసేలా సర్వే చేయించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. రేవంత్‌రెడ్డికి నిజంగా 42శాతం శాతమే రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్ విస్తరణలో 42శాతం బీసీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– శ్రీహరి యాదవ్, గొర్రెల కాపరుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు (సిద్దిపేట)
కాంగ్రెస్ బీసీల వ్యతిరేకం
రామాయంపేట, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ సర్కారు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. ఏరుదాటేదాకా ఓడ మల్లన్న ఏరుదాటినాక బోడ మల్లన్న అన్నట్టు ఉంది కాంగ్రెస్ సర్కార్ కులగణన తీరు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు సమగ్ర న్యాయం చేస్తామంటూ గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మాటమార్చి మొండిచేయి చూపడం సరికాదు. రాష్ట్రంలో బీసీల జనాభా పెరగలేదని చెప్ప డం కేవలం కాంగ్రెస్ సర్కార్కే చెల్లింది. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు కనిపిస్తుంది.
– బి.సత్యనారాయణగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు, తూప్రాన్