సంగారెడ్డి, అక్టోబర్ 10 : బీసీ రిజర్వేషన్ల ను అడ్డుకోవడం హైకోర్టు స్టే ఇవ్వడం అగ్రవర్ణాల కుట్రలో భాగమేనని, అందుకే కోర్టు స్టేతో బీసీలకు ప్రకటించిన రిజర్వేషన్లు అమ లు కాకుండా చేయడమేనని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిబాషా ఆరోపించారు. శుక్రవారం బీసీ సంఘం నాయకుడు సాయిబాషా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయిబాషా మాట్లాడుతూ రాజ్యం అగ్రవర్ణాల చేతిలో ఉన్నంత కాలం బహుజనులు బానిసలే కావాలని వారి కోరిక మేరకే బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నా బీసీ ద్రోహులరా ఖబడ్దార్ అని హెచ్చరించారు. ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం సభ్యులు కసిని మణి, అశిష్గౌడ్, శ్యామ్, మనోజ్, విజయ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.