సంగారెడ్డి/మెదక్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదికపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) నివేదికలో బీసీ జనాభా రాష్ట్రస్థాయిలో 46 శాతం ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే నివేదికలో బీసీ జనాభా తక్కువగా చూపించినట్లు ఆ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వేలో ప్రకటించిన దానికంటే రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 50 శాతానికి పైగా బీసీలు ఉంటారని, ప్రభుత్వం తగ్గించి చూపించిందని బీసీ సంఘాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగానే బీసీ జనాభా శాతం 46గా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తుల్లో ప్రభుత్వాలు కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన పక్షంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే తప్పుల తడకగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కులాల నివేదికను రద్దు చేయాలని లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పని రేవంత్‌రెడ్డి సర్కార్‌ను బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కులగణన నివేదికపై న్యాయపోరాటం చేసేందుకు బీసీ సంఘాల నాయకులు సిద్ధం అవుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గతేడాది నవంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఈ క్రమంలోనే బీసీ ఇతర కుల సంఘాల సర్వే జరుగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తంచేశాస్తున్నారు. కులగణన సర్వే శాస్త్రీయంగా జరగలేదని, ప్రభుత్వ ఉద్యోగులతో కాకుండా ప్రైవే టు వారితో కులగణన చేపట్టడంపై కుల సం ఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
సర్వేలో కులాలు, ఉపకులాల పేర్లను స్పష్టంగా పేర్కొనకపోవటంతో సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) నివేదికలో కులాల జనాభా శాతం తగ్గిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కులగణన నివేదికను అనుసరించి సంగారెడ్డి జిల్లాలో బీసీ జనాభా 46.26 శాతం గా ప్రకటించారు. బీసీల్లో రజక 3.74, నాయీ బ్రాహ్మణ 2.64, వడ్డెర 2.36, గౌడ్స్ 4.50, కురుమ 8.80, పద్మశాలీ 3.78, ముదిరాజ్ 17.60, మున్నూరు కాపు 2.07, యాదవ 5.24, వీరశైవలింగాయత్ 5.50 శాతం ఉన్నట్లు ప్రకటించారు. కులగణన నివేదిక కంటే అధికంగా జిల్లాలో బీసీ జనాభా శాతం ఉంటుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో బీసీ జనాభా శాతం 55 శాతానికి పైగా ఉంటుందని బీసీ నాయకులు బీరయ్య యాదవ్, రమేశ్ తదితరులు తెలిపారు. బీసీ ఉపకులాల గణనలో సైతం తప్పులు చేశారని, తద్వారా ఉపకులాల జనాభా సంఖ్య సైతం తక్కువగా వచ్చినట్లు చెప్పారు. లింగాయత్‌లోని ఉపకులాలను ఇతర వర్గాలు పరిణగించటంతో జనాభా గణాంకాలపై ప్రభావం పడినట్లు తెలిపారు. కులగణన సర్వే తప్పుగా జరిగినందున ప్రభుత్వం ప్రకటించిన కుల నివేదికను రద్దు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో బీసీల్లో షేక్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. బీసీల్లో ముస్లిం మైనార్టీలు 14.83 శాతం ఉన్నట్లు నివేదికలో ప్రకటించారు. బీసీ ముస్లిం మైనార్టీ వర్గం లో అత్యధికంగా షేక్‌లు 18.21 ఉన్నారు. కాగా సంగారెడ్డి జిల్లాలో ఓసీల్లో బ్రాహ్మణులు 7.49, కమ్మ 4.27, వైశ్య 8.12, రెడ్లు 34.96 శాతం ఉన్నట్లు కులగణన నివేదికలో ప్రకటించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సైతం బీసీ జనాభా శాతం తగ్గించినట్లు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మెదక్, సిద్దిపేటలో బీసీ జనాభా ఎక్కువగా ఉంటుందని, కుల గణన సందర్బంగా తప్పుగా సర్వే చేసినందున బీసీ జనాభా శాతం కులగణన నివేదికలో తక్కువగా వచ్చిందని ప్రభుత్వం వెంటనే దీన్ని సవరించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన సర్వే వివరాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని, దీనివల్ల సామాజిక న్యాయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కుటుంబాల ఆదాయ వివరాలు, వృత్తి, కుల ఆదాయ వివరాలు తప్పుగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. లోపాలతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందకుండా పోతాయని పలు కుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో లోపాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కొన్ని కులాలు అధికంగా ఉన్న సర్వేలో తక్కువగా చూపించారు. ఆర్థిక వనరులు సైతం సక్రమంగా చూపలేదు. తప్పుగా ఉన్న సర్వేతో కొన్ని కులాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాలు అందడంలో నష్టం జరుగుతుంది. ప్రభుత్వం సర్వేలో ఉన్న లోపాలు సరిచేసి ప్రకటించాలి.
– నోముల శ్రీకాంత్, మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు
రాష్ట్రంలో ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో ఉన్నారని సర్వేలో చూపుతున్నా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సర్వేలో జనాభా అధికంగా ఉన్నదని ప్రభుత్వం ప్రకటించి, సంక్షేమ పథకాల అమల్లో నిర్లక్ష్యం చేస్తున్నది. సర్వేలో ఉన్న లోపాలను గుర్తించి, క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే చేసి న్యాయం చేయాలి.
– నీరుడి మల్లేశ్ ముదిరాజ్, మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, మెదక్
రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం సామాజిక , ఆర్థిక సర్వే నివేదిక ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే సక్రమంగా చేయలేదు. కొన్ని కులాల్లో జనాభా అధికంగా ఉన్నా తక్కువగా చూపించారు. సర్వేలో ఆర్థిక అంశాలు సక్రమంగా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మధ్య విబేధాలు సృష్టించేందుకు సర్వే నివేదిక ప్రకటించింది. బీసీ ఉప కులాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేసి ప్రకటించాలి.
– మామిళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్, బీసీ సంఘం నాయకుడు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ప్రకారం కొన్ని బీసీ కులాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. తక్కువ జనాభా ఉన్న కులాల సంఖ్యను చూపించలేదు. ఆర్థికంగా వెనుకబడిన బీసీ ఉపకులాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వేను సక్రమంగా చేసి బీసీ ఉపకులాలకు న్యాయం చేయాలి.
– సోమ నర్సింలు, టైలర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు,మెదక్