సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకే బీసీ డెడికేటేడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీసీ డెడికేటేడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీసీ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఆయా సంఘాల నాయకుల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన సమగ్ర కుటుంబ సర్వే అధారంగా పూర్తిస్థాయిలో జనాభా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.
అంతకుముందు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బీసీ డెడికేటేడ్ కమిషన్ చైర్మన్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో బీసీల స్థితిగతులను వివరించారు. జిల్లాలో కుల గణన సర్వే సజావుగా జరిగిందని కమిషన్ చైర్మన్కు తెలిపారు. జిల్లాలోని వివిధ కుల సంఘాల నుంచి 24 వినతులను కమిషన్ చైర్మన్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులు, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సంఘం డీడీఆర్ రమేశ్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి, మెదక్ జిల్లా ఇన్చార్జి అధికారి జగదీశ్, సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అఖిలేష్రెడ్డి, ఆర్డీవో రవీందర్రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణగౌడ్, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్యయాదవ్, ఓడీఎఫ్ ఓబీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపల్లి పాండు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.