దుబ్బాక, అక్టోబర్10: దుబ్బాక నియోజకవర్గంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ముస్తాబు చేశారు. మహిళలు బతుకమ్మ పాటలతోపాటు కోలాటాలు ఆడుతూ పండుగను సంబురంగా జరుపుకున్నారు. అనంతరం స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోనూ సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ..మన సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అతివల అతి పెద్ద పండుగగా బతుకమ్మను జరుపుకుంటామన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణదని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, భూంరెడ్డి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, పులిగారి ఎల్లం, ఆస స్వామి, యాదగిరి, దేవుని లలిత, రామస్వామిగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.