జహీరాబాద్, సెప్టెంబర్ 24: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల శివారులో 2003 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ నుంచి వెలుబడే కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, రైతులు, ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టి సంబంధిత జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల విడుదలయ్యే కాలుష్యం, వ్యర్థజలాలతో మంజీరానదికి ప్రమాదం పొంచి ఉందా లేదా అనే వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు మంగళవారం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ మేనేజర్ గీత సందర్శించారు. ఆయా గ్రామాల పరిధిలోని భూములు, నీటి వనరులు కాలుషితమవుతాయా లేదా అనే వాస్తవ పరిస్థితులపై మండలంలోని డప్పూర్ గ్రామ శివారులోని చెరువు, న్యాల్కల్, నక్కల, కోట, చాకలి వాగులు, చినిగేపల్లి ప్రాజెక్టు, చాల్కి గ్రామ శివారులోని మంజీరానది తీరాన్ని పరిశీలించారు. నాయకులు, బాధిత రైతులు ఫార్మాసిటీ ఏర్పాటుతో కలిగే ఇబ్బందులను ఆమెతో మొరపెట్టుకున్నారు. ఆమె వెంట మండల డి ప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి, ఆర్ఐ శ్యామ్రావు, బాధిత రైతులు, ప్రజలు ఉన్నారు