హుస్నాబాద్, జూలై 26: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌తో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్‌కు నవోదయ, సైనిక్ స్కూల్ మంజూరుకు కృషిచేస్తానని తెలిపారు. నవోదయ పాఠశాల వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పదో తరగతి విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పథకంలో భాగంగా సైకిళ్లు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా పనిచేస్తానని తెలిపారు. ప్లాస్టిక్‌ను సమూలంగా నిర్మూలించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలు మరువలేనివని గుర్తుచేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.