పుల్కల్, సెప్టెంబర్ 2 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద ఉంటూ ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు. జహీరాబాద్, మనూర్, ఝరాసంగం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతోనే ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి ప్రాజెక్టులోకి 2 టీఎంసీల నీరు వచ్చి చేరిందని, మరో మూడు టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నదని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, సైగామ్ ప్రాంతాల్లో అనుకున్నంతగా వర్షాలు లేక ఇప్పటివరకు వరద రాలేదన్నారు.
సం దర్శకులను ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు. రోజూ ఒక టీఎంసీ నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండేం దుకు పది రోజులు పడుతుంది. ప్రాజెక్టులో 28 టీఎం సీలు దాటితేనే క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందన్నారు. 523.600 మీటర్లకు ప్రస్తుతం 521.200 మీటర్ల నీరు నీల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుత 18.903 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో 22036 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 391 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాలకు పుల్కల్ మండలంలోని సింగూరు సిలారపు రాజనర్సింహ కాల్వ తెగిపోయింది. మండలంలోని ఇసోజిపేట వారులో ఉన్న సింగూరు కెనాల్లోకి వరద చేరి తెగిపోయింది. దీంతో వరద గ్రామ శివారులో ఉన్న చెరువులోకి చేరుతోంది. ఈవిషయమై ఇరిగేషన్ ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా గతంలో కూడా కాల్వతెగిపోయిన మాట వాస్తవమేనన్నారు. నాలుగు రోజుల్లో కాల్వ కు మరమ్మతులు చేపట్టి బాగు చేయిస్తామన్నారు.