మనోహరాబాద్ : విధి వారిని వక్రీకరించింది. ఆనందంగా ఉన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధలతో ఒక్కసారిగా చెల్లాచెదురైంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన ఘర్షణ వారి కుటుంబాన్ని ఛిదిమేసింది. క్షణికావేశంలో భార్యను కట్టెతో మోది భర్త హత్య చేయడంతో పిల్లలు అనాథలయ్యారు. శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలిపోతుండటంతో నిలువనీడ లేకుండాపోయింది. వృద్ధురాలైన నానమ్మ మనుమరాలతో కలిసి గ్రామ మహిళా సమాఖ్య భవనంలో తలదాచుకుంటున్నది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఉషనగల్ల చంద్రం, నాగరాణి దంపతులకు దివ్య, తులసి, పావని ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు దివ్య వివాహం చేశారు. రెండో కూతురు తులసి తూప్రాన్‌లోని స్నేహ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మూడో కూతురు పావని దివ్యాంగురాలు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నది.
ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధలతో ఆగస్టు 27న రాత్రి భార్యాభర్తలు ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రం కట్టెతో కొట్టి నాగరాణిని హత్యచేశాడు. ఈ ఘటనలో చంద్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. ప్రస్తుతం పిల్లలు ఇద్దరూ అనాథలుగా మారా రు. వృద్ధురాలైన నానమ్మ దుర్గమ్మ వారిని చేరదీసింది. వృద్ధురాలికి వచ్చే రూ.2వేల పింఛన్, దివ్యాంగురాలైన పావనికి వచ్చే రూ.3వేల పిం ఛనే ప్రస్తుతం వారిని ఆదుకుంటున్నది. వారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో స్థానికులు వారిని పక్కనే ఉన్న గ్రామ సమాఖ్య భవనానికి తరలించగా.. అక్కడే తలదాచుకుంటున్నారు. తనను చదివిస్తే చదువుకుంటానని రెండో కూతురు తులసి తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమను ఆదుకోవాలని వృద్ధురాలైన దుర్గమ్మ వేడుకుంటున్నది. ఎవరైనా తమను ఆదుకుంటారేమోనని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.