హత్నూర, డిసెంబర్ 21 : ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద ఆటోడ్రైవర్లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోడ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. స్వయం ఉపాధికోసం అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతుంటే, ప్రభుత్వం తమ బతుకుదెరువులపై దెబ్బకొట్టిందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ దొరకడం లేదన్నారు. దీంతో ఓవైపు ఫైనాన్స్ డబ్బులు చెల్లించలేక, అప్పులు కట్టలేక మరోవైపు కుటుంబపోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి ఆటోడ్రైవర్లకు నెలనెలా జీవనభృతి చెల్లించాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతంచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మోటర్ ట్రాన్స్‌ఫోర్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, ఆటోయూనియన్ అధ్యక్షులు కృష్ణగౌడ్, పోచయ్య, ఆంజనేయులు, ఆటోడ్రైవర్లు లక్ష్మారెడ్డి, ప్రవీన్‌కుమార్, ఫరీఫ్, యాదయ్య, నగేశ్, నరసింహరెడ్డి, రమేశ్, ప్రదీప్ పాల్గొన్నారు.
తూప్రాన్, డిసెంబర్ 21 : మహాలక్ష్మి పథకం ద్వారా కాం గ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తుప్రాన్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆటోలను నిలిపివేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాల్‌రాజ్ మాట్లాడుతూ చాలా మంది ఆటోడ్రైవర్లు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. నిరసనలో మండల ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.