సిద్దిపేట, అక్టోబర్ 13 : “విజయ దశమి అంటే చెడు పై విజయం సాధించడం… శ్రీరాముని చేతిలో రావణుడు ఓటమి పొందిన రోజు.. శ్రీరాముడు విజయం సాధించి రామరాజ్యం వచ్చిన రోజు ఈ విజయ దశమి అని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, రూరల్ పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో శనివారం దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..ఈ రోజు నుంచి అన్నింటా అందరూ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మీరు అనుకున్న లక్ష్యాలు, సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ రోజు పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుంది, అందరికీ శుభం జరగాలన్నారు. అమ్మవారి దయతో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు.
మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. సిద్దిపేట అంటేనే దేశంలో ఒక ప్రత్యేకత ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం కూడా సిద్దిపేట స్టీల్ బ్యాంకు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందన్నారు. సిద్దిపేట జిల్లా, రైలు, మెడికల్ కాలేజ్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గోదావరి జలాలు తీసుకువచ్చి మన దశాబ్దాల కలను నెరవేర్చుకున్నామన్నారు. మన రంగనాయక సాగర్ మూడు టీఎంసీలతో కలకలలాడుతుందన్నారు. రంగనాయకసాగర్ కింద లక్ష ఎకరాలతో రెండు పంటలు పండిస్తున్నామన్నారు. త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు వెళ్తుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు రేణుకా తిరుమల్‌రెడ్డి, నాయిని చంద్రం, నాయకులు వంగనాగిరెడ్డి, అయిలయ్య, ముత్యాల కనకయ్య, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బండారు నర్సింహులు, ఎల్లం పాల్గొన్నారు.