ఆయనో గ్రామ సర్పంచ్…రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టే. ఇంకా తనకు అడ్డు చెప్పేది ఎవరు అనుకున్నాడో ఏమో కానీ రూ. కోట్లు విలుచేసే ఇరిగేషన్ శిఖం భూమిని పొతం పెట్టేందుకు భారీ స్కెచ్ వేశాడు. అభివృద్ధి పేరుతో కంటను పూడ్చి రియల్ వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ప్రశ్నించిన స్థానికులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు.ఆ భూమిని అధికారులు ఇదివరకే నిషేధిత జాబితాలో చేర్చినా, చట్టం తన చుట్టమైనట్లు కుంటలో మట్టిపోసి చదును చేశాడు. ఎన్నో ఏండ్లుగా పంటలు ,పశువులకు నీళ్లందిస్తూ ఆహ్లాదం పంచిన బొల్లికుంట నేడు కనుమరుగైపోతున్నది.
అందోల్, జూలై 23: సంగారెడ్డి జిల్లా అం దోల్ మండలంలోని చింతకుంట శివారు సర్వే నంబర్ 661లో 2.31 (రెండు ఎకరాల 31 గుంటలు) ఎకరాల్లో బొల్లి కుం ట ఉంది. కొన్ని దశాబ్దాలుగా దీన్ని అధికారులు ఇరిగేషన్ శిఖంగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చా రు. తాజాగా ఈ కుంటలో గ్రామ సర్పంచ్ మట్టిపోసి పూర్తిగా పూడ్చివేశాడు. ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్తులకు, అది ప్రభు త్వ భూమి అని, దానిని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని సమాధానం ఇస్తున్నాడు. దీంతో గ్రామస్తులు సోమవారం సంగారెడ్డి కలెక్టర్లోని నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
చింతకుంటలో ప్రధాన రహదారిపై ఉన్న ఈ కుంటలో వందలకొద్ది టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిపోసి పూడ్చేస్తు న్నా అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. రూ. కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా పూడ్చివేసి నామరూపాలు లేకుం డా చేశాడు. దీంతో మూగజీవాలకు నీటి కరువు ఏర్పడింది. పంట కాల్వలు, మురుగు నీరు వెళ్లే కాల్వలు పూడ్చడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికార పార్టీ నాయకులు, కొంతమంది అధికారులతో కుమ్మక్కై కుంటను పూడ్చివేసి ప్ల్లాట్లుగా విక్రయిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. కుంటను పూడుస్తున్నది అధికార పార్టీ సర్పంచ్ కావడంతో అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని చింతకుంట సర్వేనంబర్ 661లోని 2.31 గుంటల భూమి రికార్డులో కొన్నేండ్లుగా ఇరిగేషన్ శిఖంగా ఉన్నది. అందుకే దీనిని నిషేధిత భూముల జాబితాలో చేర్చాం. నిషేధిత భూములు, చెరువు శిఖం, ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చింతకుంటలోని బొల్లికుంటలో మట్టిపోసి చదును చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుంటనుంచి మట్టిని తొలిగించి దానిని యథాస్థితిలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతాం. భూమి కబ్జాకు యత్నించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– సాగర్ మధుకర్‌రెడ్డి, అందోల్ తహసీల్దార్ (సంగారెడ్డి జిల్లా)