గజ్వేల్, ఏప్రిల్ 4: తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ముమ్మాటికి ఇది సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అన్నారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయిమరిచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందన్నారు. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని, ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక వైపు‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రజలు ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజాపాలన అన్నారు. ఇందిరమ్మ రాజ్యమని చెబుతూ.. గూండాల రాజ్యం అమలు చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ర్టాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ఉంటే ఇక్కడ పాలన ఎవరూ చూస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా… కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా చెప్పాలన్నారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బాకొట్టి ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎమర్జెన్సీ పాలనను తలపిస్త్తోందన్నారు.
మీ అణచివేతలకు, నిర్భంధాలకు, దాడులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బెదిరేదిలేదని, ప్రజాక్షేత్రంలో మిమ్ముల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ గూండాలను హరిశ్‌రావు హెచ్చరించారు.