పటాన్చెరు, మార్చి 14: అమీన్పూర్, తెల్లాపూర్, ఇస్నాపూర్, మున్సిపాలిటీల్లో ఇప్పుడు, ఒకప్పటి కార్యదర్శులకు బంగారు రోజులు వచ్చాయి. పెద్దఎత్తున అక్రమ దందా కొనసాగుతున్నది. కృష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, ముత్తంగి, పాటి, ఘనపూర్, ఇస్నాపూర్, చిట్కుల్ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. అమీన్‌ఫూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలు దాదాపు ఐదేండ్ల క్రితం ఏర్పాటు కాగా, ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు ఈ మధ్యకాలంలో ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల్లోకి విలీనం కాగానే కొందరు అప్పటి కార్యదర్శులకు కలిసి వస్తున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో పనిచేసి వెళ్లిపోయిన కార్యదర్శులు కొత్తగా ఇండ్ల పర్మిషన్లు ఇస్తున్నారు.
విలీన సమయంలో ఉన్న కార్యదర్శులను మున్సిపాలిటీల్లోనే ఉద్యోగులుగా అపాయింట్ చేశారు. గతంలో పనిచేసి వెళ్లిన వారు పాత తేదీల్లో పర్మిషన్లు ఇచ్చి అక్రమంగా ఆర్జిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కొత్త పర్మిషన్లకు రెట్టింపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఉన్నా, ఆ కాలంలో కార్యదర్శులు ఆఫ్‌లైన్ పర్మిషన్లే ఇచ్చేవారు. స్టాంపులు, రసీదు బుక్కులు, రిజిస్టర్ల కాపీలు, ఇతర పర్మిషన్ పత్రాలు ఈ కార్యదర్శుల వద్ద అదనంగా ఉన్నాయి.
గ్రామాల్లో వీరికి అసిస్టెంట్లుగా పనిచేసిన కారోబార్లు, బిల్ కలెక్టర్లు, చిరుద్యోగులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ వీరికి బేరాలు తెస్తున్నారు. మున్సిపాలిటీలో గృహం నిర్మించేందుకు దరఖాస్తు కోసం వచ్చిన వారిని పక్కదారి పట్టించి పాత తేదీల్లో ఇంటి పర్మిషన్లు ఇప్పిస్తున్నారు. ఇలా వచ్చిన పర్మిషన్లను పన్నుల చెల్లింపు సమయంలో చిరుద్యోగుల సహాయంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పుడు ముత్తంగి, చిట్కుల్, పటేల్‌గూడ, కృష్టారెడ్డిపేట్, ఇస్నాపూర్, పాటి, ఘనపూర్‌లలో పంచాయతీ పర్మిషన్ల పేరున భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
కమర్షియల్ నిర్మాణాలకు అక్రమ పర్మిషన్లు ఇస్తున్నారు. లావణి పట్టాలో నిర్మాణాలకు, స్థలాల రెగ్యులరైజ్ కోసం పాత తేదీల్లో పంచాయతీ కార్యదర్శులు గ్రామ కంఠం ఆబాది అని పర్మిషన్లు ఇస్తున్నారు. ఆ ఆసిస్మెంట్ నెంబర్ ఆధారంగా మున్సిపాలిటీల్లో పీటిన్ నెంబర్‌కు దరఖాస్తు చేస్తున్నారు. వీటి ఆధారంగానే మున్సిపాలిటీల్లో పన్నులు తీసుకొని రసీదులు, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వివాదంలో ఉన్న ప్లాట్లు, ఇతర నిర్మాణాలకు కక్కుర్తిపడి పాత కార్యదర్శులు ఇస్తున్న పర్మిషన్లు మరొకరికి వరంలా మారుతున్నది. ఈ వెసులుబాటు చూసి పేద, మధ్య తరగతి వారి ప్లాట్లను కబ్జా చేసి బలవంతంగా ఇండ్లను నిర్మించే సంస్కృతి ప్రారంభమైంది.
ముత్తంగి, పటేల్‌గూడ, కృష్టారెడ్డిపేట్, ఘనపూర్, ఇస్నాపూర్లలో జోరుగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. పంచాయతీల్లో జీ ప్లస్ టు పేరున పర్మిషన్లు తీసుకొని జీ ప్లస్ ఫోర్ వేస్తున్నారు. ఐదంతస్తుల నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. కొత్తగా మున్సిపాలిటీల్లో విలీనం అయిన గ్రామాల్లో జరుగుతున్న అక్రమ పర్మిషన్ల దందా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగానికి అర్థంకాని పరిస్థితి. పర్మిషన్లు తక్కువ, నిర్మాణాలు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంది. మున్సిపాలిటీల్లో ట్యాక్స్ ఎక్కువ అనే భయం ప్రజల్లో ప్రచారం చేసి, బదిలీపై వెళ్లిన పాత కార్యదర్శులు పాత తేదీల్లో పర్మిషన్లు మంజూరు చేస్తున్నారు.
పంచాయతీల్లోనూ పర్మిషన్లు ఇచ్చే అధికారం హెచ్ఎండీఏకు ఉన్నా, పంచాయతీ కార్యదర్శులే పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీలుగా పలు మేజర్ పంచాయతీలు కాగానే అనుమతులు ఇచ్చేందుకు నాటి పంచాయతీ కార్యదర్శులు తెలివిగా పావులు కదిపారు. ఇప్పుడు ముత్తంగిలో, బీరంగూడలో, సంగారెడ్డిలో పనిచేసి వేరే పంచాయతీలకు వెళ్లిన కార్యదర్శులు రూంలు అద్దెకు తీసుకుని దుకాణాలు తెరిచారు. రహస్యంగా పర్మిషన్లు ఇస్తూ మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
మున్సిపల్ ఉద్యోగులు నిర్మాణాల వద్దకు వెళ్లి పాత పర్మిషన్లు చూసి వెనుదిరుగుతున్నారు. పైగా స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు ఫోన్లు చేసి బెదింపులకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు పంచాయతీల్లో పనిచేసి వెళ్లిపోయిన కార్యదర్శులు బదిలీ అయినచోట ఉండకుండా ఈ మున్సిపాలిటీల్లో తిష్ట వేసి విలీనం అయిన పంచాయతీల వద్ద అక్రమ అనుమతులు ఇస్తున్నారని అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీల్లో పర్మిషన్ల నకలు కాపీలు ఉండట్లేదు. పర్మిషన్ల వివరాలు లేనివన్నీ అక్రమ నిర్మాణాలుగా పరిగణించవచ్చు. ఇప్పటికైనా ఈ అక్రమ దందాకు జిల్లా అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో సర్కారు భూములకు ఇచ్చిన అక్రమ పర్మిషన్ పత్రాలు కబ్జాకోరులకు వరంలా మారే అవకాశం ఉంది.