గజ్వేల్, డిసెంబర్ 2: పంచాయతీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు కుల పెద్దలను కలుస్తూ భారీ ఆఫర్లు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో జరగనున్న గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, ములుగు, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లోని 153 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఆఫర్లతో ఆకట్టుకునేందుకు కులపెద్దలకు భారీగా నజరానాలు ప్రకటిస్తున్నారు.
కులాల వారీగా భారీగా డబ్బులు అప్పగించి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవాలని సర్పంచ్ అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. మొదట కులాలతో ఓకే చెప్పించుకుంటే ,ఇక గెలుపు తమదే అన్న భావనలో అభ్యర్థులు భారీగా డబ్బులు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. జనరల్ స్థానాల్లో భారీగానే ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. రిజర్వుడ్ స్థానాల్లో మాత్రం అంతగా ఖర్చు పెట్టకపోగా, అక్కడ మాత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ మంచోళ్లు అనే చర్చ పెడుతున్నారు. గ్రామాభివృద్ధికి ఎంత కృషి చేస్తారు, గతంలో పనిచేసిన వాళ్లు ఏమీ చేశారు, కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని చర్చ మొదలైంది.
కొత్త వారికి, యువతకు ప్రాధాన్యత ఇస్తే అన్ని వర్గాల మేలు చేకూరుతుందనే భావనకు వస్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏకగ్రీవమైన పంచాయతీల్లో చూస్తే ప్రధానంగా దేవాలయ నిర్మాణాలకు కమిట్మెంట్ ఇచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. రూ.లక్షల్లో వేలం పాట పాడుకొని సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. మాకు మాత్రం గ్రామాభివృద్ధి కావాలని గ్రామస్తుల తీర్మానంతో ఏకగ్రీవం దిశగా మారాయి. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల సందర్భంగా చాలా వరకు మాకేమీస్తారు, మాకేమీ చేస్తారంటూ ఓటర్లు అభ్యర్థులను అడుగుతున్నారు.