మెదక్ అర్బన్, అక్టోబర్ 28: నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియను సీసీ కెమెరాల సమక్షంలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడు తూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ముగిసేవరకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 3గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు సూచికను ఏర్పాటు చేసి ఇతరులను ఎవరిని ప్రవేశించకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ వేసేవారితోపాటు మరో నలుగురిని అనుమతించాలన్నారు. 11 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించొద్దన్నారు. నామినేషన్ల పరి శీలన ఎప్పుడు? ఎక్కడ నిర్వహిస్తారనే? సమాచారం అభ్యర్థులకు తెలియజేయాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థుల వ్యయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అభ్యర్థుల వ్యయ వివరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్వో పద్మ, ఆర్డీవోలు జయచంద్ర, రాజేశ్వర్, శ్రీనివాస్, రిటర్నింగ్ అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
అత్యవసర సేవల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
అత్యవసర సేవల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించు కోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా సూచించారు. పోస్టల్ బ్యాలెట్‌ను విద్యుత్, అగ్నిమాపక, రవాణా, బీఎస్ఎన్ఎల్, రైల్వే, వైద్యశాఖ సిబ్బందికి కల్పించినట్లు తెలిపారు. నవంబర్ 7లోపు నిర్ణీత ఫారం -12(డీ) పూర్తి చేసి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని సూచించారు. సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో కలెక్టర్ అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 80 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులు, కొవిడ్ బాధితులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. అత్యవసర సర్వీసులకు చెందినవారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఫారం-12(డీ) పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. ఫారం-12(డీ) దరఖాస్తులు నోడల్ అధికారి లేదా రిటర్నింగ్ కార్యాలయం లేదా ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆర్వో కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్‌పై ఓటు వేయాల్సి ఉం టుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్, నోడల్ అధికారి, అత్యవసర సర్వీసుశాఖల అధికారులు పాల్గొన్నారు.