సిటీబ్యూరో/అబిడ్స్, జనవరి 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపు ఉన్న భవనంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షోరూమ్ గోడౌన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో వాటిని అదుపు చేయడానికి రెస్క్యూ బృందాలు చాలా శ్రమించాల్సి వచ్చింది. నాంపల్లి చిరాగ్ అలీలేన్లో ఉన్న ఐదంతస్తుల సాయి విశ్వాస్ చాంబర్స్ భవనంలోని బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్‌లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రమాదం జరగగా అక్కడి నుంచి మంటలు పైన ఉన్న నాలుగు అంతస్తుల వరకు వేగంగా వ్యాపించాయి. అగ్ని మాపక శాఖకు వెంటనే సమాచారం అందించడంతో మొదట నాలుగు ఫైరింజన్లు తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సాధ్యపడకపోవడంతో మొత్తం పది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఘటనాస్థలానికి చేరుకున్న భారీ క్రేన్ల సాయంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. జీ ప్లస్ ఫోర్ భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మంటల్లో చిక్కుకున్నారు.
వీరి పరిస్థితి ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భవనం చుట్టూ సెట్‌బ్యాక్స్ (ఖాళీ స్థలం) లేకపోవడంతో ఫైరింజన్లు లోపలికి వెళ్లడానికి చాలా ఇబ్బంది జరిగింది. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న భవనాల గోడలపైకి ఎక్కి ప్రాణాలకు తెగించి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కాంప్లెక్స్ అద్దాలను పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సుమారు పదిగంటల పాటు రెస్క్యూ బృందాల ఆపరేషన్‌తో మంటలు అదుపులోకి వచ్చాయి.

గోడౌన్లో ఫర్నిచర్ ఉండడంతో..
భవనం సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. సెల్లార్ లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండడంతో మంటలు వేగంగా పైఅంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు పరుగులు తీశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సాయంతో ఫర్నిచర్ సామగ్రిని తొలగించారు. ఆ డంప్ పూర్తిగా తొలగిస్తే తప్ప లోపల ఉన్నవారి పరిస్థితి ఏంటనేది తెలియదని అధికారులు చెప్పారు. పై అంతస్తుల నుంచి భవనం లోపల ఉన్నవారిని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకొచ్చారు.
మరోవైపు భవనం పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదంలో పెద్ద మంటలు చెలరేగడంతో వాటిని అదుపు చేయడానికి ఫైర్ అధికారులు బ్రాంబో ఫైర్ మిషన్ తీసుకొచ్చారు. అతిపెద్దదైన బ్రాంబో మిషన్‌లో ఫైర్ సిబ్బంది ఉండి భవనం పరిసరాల 4, 5అంతస్తుల అద్దాలను పగుటగొట్టి మంటలు, పొగను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారడంతో రంగంలోకి రెండు రోబో ఫైర్ మిషన్లను దిం పారు. హైదరాబాద్‌లో మొదటిసారిగా ఈ రోబోలు వాడుతున్నామని అధికారులు తెలిపారు.

స్కూల్‌కు వెళ్లకుండా మంటల్లో చిక్కి..
ఈ భవనంలో మూడు కుటుంబాలు పనిచేస్తున్నాయి. అందులో భవనం వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతులు, పిల్లలు అఖిల్(7), ప్రణీత్(11) గన్‌ఫౌండ్రీలోని ప్రభుత్వ ఆలియా పాఠశాలలో చదువుతున్నారు. శనివారం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఆ ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. గోడౌన్లో ఆడుకోమని తండ్రి చెప్పి వెళ్లడంతో అక్కడికి వెళ్లి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక అక్కడే ఉండిపోయారు.
వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న స్వీపర్ గుల్బర్గాకు చెందిన వచ్చిమన్ బేబీ (60) లోపలే ఉండిపోయింది. వీరిని రక్షించడానికి లోపలకు వెళ్లిన మహ్మద్ ఇంతియాజ్ (27),సయ్యద్ హబీబ్(40)లు కూడా లోపలే చిక్కుకుపోయారు. నాంపల్లికి చెందిన ఇంతియాజ్ ఫర్నిచర్ షాపులో పనిచేస్తుండగా, శాస్త్రిపురంనకు చెందిన హబీబ్ ఫర్నిచర్ వెహికల్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. లోపల తమవారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తప్పించుకున్న కుక్క
భవనంలో ఓ కుక్క మంటల నుంచి బయటపడింది. పై అంతస్తులో ఉన్న కుక్క మంటలను చూసి మొరుగుతుండగా అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు ఆ కుక్కను బయటకు తీసుకొచ్చాయి. భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో అక్కడ నాలగవఅంతస్తులో ఉన్న యూపీకి చెందిన సంతోష్ అనే వ్యక్తి వెంటనే బయటకు వచ్చారు. అదే సమయంలో లోపల ఉన్న వారు ముగ్గురు స్పృహ తప్పి పడిపోవడంతో కొందరు స్థానికులు ధైర్యంగా లోపలకు వెళ్లి బయటకు తీసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఆప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఒకవైపు రోడ్డుపై రద్దీ.. మరోవైపు మంటలు, పొగ.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భవనంలో ఉన్నవారిని వెంటవెంటనే బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, స్థానికులు కలిసి ప్రయత్నించారు.
నుమాయిష్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
నాంపల్లి ప్రధాన రహదారిపై ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం జరగడంతో పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, ఎంజే మార్కెట్, ఏక్‌మినార్ మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఫైర్‌ఇంజిన్లు, అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లడానికి వీలుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతుండడంతో జనసంచారం విపరీతంగా ఉంటుంది. అగ్ని ప్రమాదం, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. శనివారం నుమాయిష్‌కు రావాలని ప్లాన్ చేసుకున్నవారు తమ పర్యటనను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులో ప్రమాదం కారణంగా పరిసరప్రాంతాల్లో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతంలో పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
హెచ్ఆర్సీలో ఫిర్యాదు
సుల్తాన్‌బజార్, జనవరి 24:నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ మానవహక్కుల కమిషన్‌కు న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు చేశారు. నాంపల్లి ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మంటల్లో చిక్కుకున్నారని, దీనికి పాలనానిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సంవత్సరం గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17మంది మృతి చెందారని, అంతకుముందు నాంపల్లిలోనే జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారని, నగరంలోని అక్రమ కట్టడాలే అగ్నిప్రమాదాలకు కారణమని ఫిర్యాదులో తెలిపారు. ఇటీవల గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ స్టడీలో ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయని, హైదరాబాద్‌లో 13లక్షల మంది ప్రజలు, 2.6లక్షల కుటుంబాలు ప్రమాదపుటంచుల్లో ఉన్నారని ఆ పరిశోధన బృందం వెల్లడించిందని చెప్పారు. రామారావు ఫిర్యాదు మేరకు హెచ్ఆర్సీ ఈ ఘటనపై కేసు నమోదు చేసింది.

సెల్లార్లో భారీగా నీరు..!
నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని సెల్లార్లో పెద్దఎత్తున నీరు చేరింది. మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్ల సాయంతో సుమారుగా 23 ట్యాంకర్ల నీటిని కొట్టారు. దీంతో సెల్లార్ చిన్నపాటి చెరువును తలపిస్తున్నదని సహాయక సిబ్బంది చెప్పారు. లోపలకు వెళ్లడానికి ఒకవైపు పొగ ఇబ్బంది పెడుతుంటే మరోవైపు లోపల విజిబులిటీ లేదని, ఇదే సమయంలో నీరు ఉండడంతో పడవపై వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. గత 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ మంటల్లో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
ఘటనాస్థలికి కలెక్టర్, సీపీ
నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనాస్థలానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, సీపీ సజ్జనార్, ఫైర్ డీజీ విక్రమ్మాన్సింగ్ చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై హరిచందన సీపీ సజ్జనార్‌తో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఘటనకు కారణాలపై స్థానికులు, అధికారులతో ఆరా తీశారు. పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలంటూ కొన్ని సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ప్రమాద స్థలిలో తీసుకుంటున్న సహాయక చర్యలను హరిచందన ఫోన్ ద్వారా ప్రభుత్వపెద్దలకు వివరించారు. ప్రమాద స్థలానికి ఇరువైపులా ఉన్న భవనాల్లోంచి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో వారు స్థానికులను అక్కడి నుంచి తరలించారు.
వీలైనంత తొందరగా క్షతగాత్రులను గుర్తించి, చికిత్స అందించాలని చెప్పిన కలెక్టర్.. దాదాపు మూడుగంటల పాటు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు సీపీ సజ్జనార్ ఘటనాస్థలంలో ప్రమాద తీవ్రతను అంచనా వేస్తూ అక్కడికి మరిన్ని ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. పొగ ఎక్కువగా ఉండడంతో సిబ్బంది భవనం లోపలికి వెళ్లడానికి ప్రారంభంలో చాలా ఇబ్బంది జరిగిందని సజ్జనార్ చెప్పారు. లోపల ఎంతమంది ఉన్నారో చెప్పేందుకు ఇప్పటికీ స్పష్టత లేదని, రోబోను పంపించి లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని అయినా అక్కడ ఫర్నీచర్ ఎక్కువగా ఉండడంతో రోబో కూడా లోపల తిరగడం కష్టమైందని అధికారులు తెలిపారు.