గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారిశుధ్య నిర్వహణ ఇప్పుడు ఒక ప్రైవేటు సంస్థ చేతుల్లో బందీ కావడమే కాకుండా, భవిష్యత్ కార్పొరేషన్ల మనుగడపై కూడా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రం 2009లో జరిగిన 25 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని, అటు జీహెచ్ఎంసీ ఖజానాను ఖాళీ చేస్తూ.. ఇటు కొత్తగా ఏర్పడే మున్సిపల్ కార్పొరేషన్లపై కూడా పెత్తనం చెలాయించేందుకు రాంకీ సంస్థ పావులు కదుపుతోంది.
సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీని భవిష్యత్‌లో విస్తరించిన ప్రాంతాల్లోనూ (60 కిలోమీటర్ల వరకు) రాంకీ ఆధ్వర్యంలోనే పారిశుధ్య నిర్వహణ ఉండేలా నిబంధన పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఒప్పందంలో విస్తరణ గురించిన ప్రస్తావించారే తప్ప.. విభజనపై రాంకీ సంస్థకే ఇవ్వాలనే ప్రతిపాదన లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఫిబ్రవరి 10 తర్వాత కొత్తగా ఏర్పడనున్న మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లను సైతం తమకు ఇవ్వాలనే ప్రతిపాదనలతో పాటు ఒప్పందంలో మిగిలిపోయిన ఇంటింటి చెత్త సేకరణ కూడా ఇవ్వాలని జీహెచ్ఎంసీపై సదరు రాంకీ సంస్థ ఒత్తిడి పెంచుతున్నట్లు చర్చ జరుగుతున్నది.
ఒప్పందం కాగితాలకే పరిమితం
జీహెచ్ఎంసీ విభజన నేపథ్యంలో నగరంలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడనున్నాయి. అయితే, అసలు ఒప్పందంలో విస్తరణ అనే పదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, విభజన తర్వాత ఏర్పడే కొత్త సంస్థల పరిధిలోనూ తామే చెత్త సేకరిస్తామని రాంకీ పట్టుబడుతోంది. ఒప్పంద వివరాల్లోకి వెళితే 25 ఏండ్ల ఒప్పందంలో రాంకీ నిత్యం ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలి. డంపింగ్ యార్డు నిర్వహణ, సైంటిఫిక్ డిస్పోజల్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. మొదటి దశలో డంపింగ్ యార్డు, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం ఫీజు మాత్రమే ఇచ్చేశారు.
కానీ క్రమంగా చెత్త రవాణా 20 శాతం, డంపింగ్ యార్డులో చెత్త నిల్వ, శాస్త్రీయ విధానంలో నిర్వహణకు 40 శాతం, రోడ్లపై ఉన్న చెత్తను సైతం తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి 30 శాతం..మొత్తం 90 శాతం రాంకీ చేతికి వెళ్లిపోయింది. 2009లో మెట్రిక్ టన్నుకు రూ.1800తో మొదలైన ఈ ఒప్పందం, ఇప్పుడు రూ.2,110 (90 శాతం చెల్లింపులు) వద్ద కొనసాగుతోంది. 100 శాతం పనులు పూర్తి చేస్తే రూ.2,345 చెల్లించాల్సి ఉంటుంది. మెరుగైన నిర్వహణ లేకుండానే రవాణా, డంపింగ్ యార్డు నిర్వహణ పేరుతో భారీగా బిల్లులు డ్రా చేస్తుండడం, కొందరు అధికారులు సైతం రాంకీకి అండగా నిలబడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయని, సైంటిఫిక్ డిస్పోజల్ (శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ) సరిగా జరగడం లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం నిధులను గుంజుకోవడమే తప్ప.. అకడ కాలుష్య నివారణపై సంస్థ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కొత్త కార్పొరేషన్లు కూడా ఆ సంస్థకే ఇస్తే, నగర శివారు ప్రాంతాలు మరో జవహర్ నగర్లుగా మారే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిశుధ్య ్య నిర్వహణలో పోటీతత్వం పెంచి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరుతున్నారు. కాగా, ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటున్నది? రాంకీ సంస్థకే కొత్త కార్పొరేషన్ల బాధ్యతలు అప్పగిస్తుందా? లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
విలీన సవాళ్ల పరిష్కారానికి హైలెవల్ కమిటీ
విలీన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకం…మున్సిపల్ ఘన వ్యర్థాల (ఎంఎస్‌డబ్ల్యూ) నిర్వహణలో లోపాలు తలెత్తకుండా చూడడంపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించనున్నది. రీ సైస్టెనబిలిటి లిమిటెడ్ సంస్థ అందిస్తున్న సేవల నాణ్యతను పరిశీలించి, భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నది. పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీటీఆర్ఐ) నిపుణుల సలహాలతో శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
కాగా కమిటీలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు శ్రీజన, టి. వినయ్ కృష్ణా రెడ్డి, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, ఈపీటీఆర్ఐ ప్రతినిధి లీలావతిలకు కమిటీ బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు లీగల్, అకౌంట్స్, ఇంజినీరింగ్ విభాగాల నిపుణులు కూడా ఈ కమిటీలో భాగస్వాములుగా ఉండి విలీన ప్రాంతాల అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా చెత్త సేకరణ, ఆస్తుల గుర్తింపు, సిబ్బంది సమీకరణ, ఆర్థిక పారదర్శకత తదితర అంశాలపై కమిటీ దృష్టి సారించనున్నది.