జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీనంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నెలన్నర రోజులుగా నిలిచిపోవడంతో దాదాపు 35వేల దరఖాస్తులు మూలకు పడ్డాయి. సరిళ్ల సంఖ్యను 30 నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న హడావిడి నిర్ణయం ప్రజల పాలిట శాపంగా మారింది. సరిళ్ల సంఖ్య పెరగడంతో పాత వారిని మార్చి కొత్త వారిని నియమించారు. వీరికి అధికారికంగా డిజిటల్ సిగ్నేచర్ అధికారాలు లభించలేదు. కొత్త సరిళ్లలో కార్యాలయాల ఏర్పాటూ అరకొరగానే ఉండటంతో రికార్డుల నిర్వహణ గందర గోళంగా మారింది.
– సిటీబ్యూరో
బల్దియాను 60 సరిళ్లుగా విభజించినప్పటికీ, సాంకేతికంగా వాటిని సాఫ్ట్ వేర్లో మ్యాపింగ్ చేయడంలో ఐటీ విభాగం విఫలమైంది. కొత్త సరిళ్ల పరిధిలోకి వచ్చే ఆసుపత్రుల వివరాలను పోర్టల్‌లో అప్ డేట్ చేయకపోవడంతో డేటా ఎంట్రీ నిలిచిపోయింది. మెడికల్ ఆఫీసర్ల భారీ బదిలీలు ఈ సమస్యను మరింత జఠిలం చేశాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు డిజిటల్ కీలు లాగిన్ క్రెడెన్షియల్స్ అందకపోవడంతో వారు చేతులెత్తేస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 30,000 నుండి 35,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సూల్ అడ్మిషన్లు, పాస్ పోర్ట్ దరఖాస్తుల కోసం బర్త్ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. మరణ ధృవీకరణ పత్రాలు అందక భీమా (ఇన్సూరెన్స్) సొమ్ము కోసం, ఆస్తి బదలాయింపుల కోసం బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మీ-సేవా కేంద్రాలకు వెళ్తే సర్వర్ పనిచేయడం లేదని, జీహెచ్ ఎంసీ ఆఫీసులకు వెళ్తే ఆఫీసర్లు లేరని సమాధానం వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్టిఫికెట్లు ఎప్పుడు జారీ అవుతాయో చెప్పే దికు లేక నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెండింగ్‌లో ఉన్న సర్కిళ్లు (టాప్ 10)
సర్కిల్ : పెండింగ్ దరఖాస్తులు
బేగంపేట : 2641
మెహిదీపట్నం : 1326
హయత్‌నగర్ : 1308
చార్మినార్ : 1009
యూసుఫ్‌గూడ : 991
గోషామహల్ : 986
చాంద్రాయణ గుట్ట : 828
కాప్రా : 819
ఫలక్‌నుమా : 737
ఎల్భీనగర్ : 687