‘గల్ఫ్’ సినిమాతో ఇండస్త్రీకి పరిచయమై.. ‘గద్దలకొండ గణేష్’లోని ‘సూపర్ హిట్టు’ పాటలో తన నాట్యంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది డింపుల్ హయాతి. టాలెంట్ ఉంటే రంగుతో పనేంటి అంటున్న ఈ టాలీవుడ్ బ్యూటీ తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో రవితేజతో జతకట్టింది. ఈ సందర్భంగా క్రేజీ బ్యూటీ పంచుకున్న కబుర్లివి..
పుట్టింది విజయవాడలో అయినా.. నా బాల్యమంతా హైదరాబాద్‌లోనే సాగింది. నా స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చా. నా అసలు పేరు డింపుల్. మరీ చిన్నగా ఉందని సంఖ్యాశాస్త్రం ప్రకారం హయాతి అని అదనంగా జోడించా. సినిమాలంటే తెగ ఇష్టం. ఎంతలా అంటే చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అని చెప్పుకొనేదాన్ని. పదహారో ఏటనే ‘గల్ఫ్’ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టా. కథానాయిక ఒక తెలుగమ్మాయి అని హద్దులు గీస్తుంటారు. వాటిని చెరిపేయడమే లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నా.
‘కిక్’లో రవితేజతో నటించే అవకాశం చేయి జారిపోయింది. అయినా కూడా అయనతో కలిసి గతంలో ఖిలాడీ, ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించాననే సంతోషమైతే ఉంది. సినిమాలో నేను చేసిన బాలమణి క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్తగా ఉందని ఆడియెన్స్ మెచ్చుకుంటుండటం సంతోషాన్నిస్తున్నది.
మా ఇంట్లో అందరూ నటులే. దాసరి నారాయణరావు నాకు తాత వరుస. మా తాతకు ఆయన కజిన్. మా నానమ్మ పేరు ప్రభ. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీయార్‌తోనూ ‘దానవీర శూరకర్ణ’లో నటించారు. కిక్ సినిమాలో ఆమె రవితేజకు తల్లి పాత్ర చేశారు. ఆ టైంలోనే నా ఫొటోను డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చూపించడంతో ఇలియానా చెల్లి పాత్ర కోసం అడిగారు. అప్పడు నేనింకా నాలుగో తరగతే చదువుతుండటంతో ఇప్పుడే సినిమాలేంటని ఇంట్లో వాళ్లు వద్దనేశారు.
సరైన సినిమా కోసం చాలాకాలం ఎదురు చూశా. చిత్ర పరిశ్రమలో మనం వేసే ప్రతి అడుగూ పక్కాగా ఉండాల్సిందే కదా! ‘గద్దలకొండ గణేష్’లో ‘సూపర్‌హిట్టు..’ పాట తరువాత అన్నీ అలాంటి అవకాశాలే తలుపుతట్టాయి. ప్రత్యేక గీతాలు వద్దనుకున్నా. నేను కలలుగన్న హీరోలతో తెరని పంచుకునే అవకాశం వచ్చినా ఓకే చెప్పలేదు. నేను డ్యాన్స్ మాత్రమే కాదు.. చక్కగా నటించగలను అని నిరూపించుకోవడానికి ప్రత్యేక గీతాలు చేయనని చెప్పా!
నాకు రోజూ జిమ్ చేసే అలవాటు. షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి దగ్గర్లోని జిమ్ సెంటర్‌కు వెళ్లి మరీ జాయిన్ అవుతాను. ‘అత్రంగ్ రే’ షూట్లో నాకో వింతైన అనుభవం ఎదురైంది. ఆ సినిమా షూటింగ్ ఓ మారుమూల గ్రామంలో జరిగినప్పుడు అక్కడ జిమ్ చేసుకునే సౌకర్యాలు ఏమీ లేవు. ధనుష్ ఈ విషయం తెలుసుకొని నా కోసం డంబుల్స్, వెయిట్స్ పంపించాడు.
చాలామందికి ఎదురైనట్టుగానే నా జీవితంలోనూ మంచి, చెడు అనుభవాలు ఉన్నాయి. నా స్కిన్‌టోన్ కాస్త చామనఛాయ. ఈ గ్లామర్ ఫీల్డ్‌లో ఫెయిర్ స్కిన్, అందానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నా స్కిన్ టోన్ గురించి నేరుగా కాకపోయినా, వెనకాల కామెంట్చేసేవాళ్లు. ఈ విషయంలో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తున్నది. ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది.